అభిమానులకు అనుకోని షాక్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్
విధ్వంసకర ఆటగాడు తీసుకున్న సంచలన నిర్ణయం
క్రికెట్ క్రీడారంగంలో విధ్వంసకర ఆటగాడిగా పేరున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (34) తన అభిమానులకు అనుకోని షాక్ ఇచ్చాడు. క్రికెట్‌లో అన్నివైపులా షాట్స్ బాది ఎటువంటి బంతినైనా సిక్సర్స్‌గా మలచడంలో ‘360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్’గానూ పేరు తెచ్చుకున్న డివిలియర్స్ తన క్రికెట్ కెరీర్‌కి సంబంధించి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను సత్వరమే అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలుకుతున్నట్టు డివిలియర్స్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు డివిలియర్స్ తాజా ప్రకటనలో స్పష్టంచేశాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన డివిలియర్స్.. అందులో తన నిర్ణయం వెనుకున్న కారణాలు వివరించాడు. దక్షిణాఫ్రికా తరపున 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ అందులో 22 సెంచరీలు నమోదు చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌ల్లో డివిలియర్స్ స్కోర్ చేసిన మొత్తం పరుగులు 8,765. ఇక డివిలియర్స్ వన్డే కెరీర్ విషయానికొస్తే, 228 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ సౌతాఫ్రికా మాజీ కెప్టేన్.. అందులో 25 సెంచరీలు నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో డివిలియర్స్ చేసిన మొత్తం పరుగులు 8,577.
తన రిటైర్‌మెంట్ గురించి ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియోలో తాను కెరీర్‌లో అలసిపోయినట్టు అంగీకరించిన డివిలియర్స్.. ఇక ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఆసన్నమైందన్నాడు. ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానన్న ఈ విధ్వంసకర ఆటగాడు.. బాగా ఆడుతున్న రోజుల్లోనే గౌరవప్రదంగా ఆట నుంచి తప్పుకోవడం ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకు 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైనా.. ఐపీఎల్ లాంటి టీ20 లీగ్స్‌లో పాల్గొనే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.