టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ అంబటి రాయుడిపై బీసీసీఐ నిషేధం విధించింది. అంబటి రాయుడిపై రెండు మ్యాచ్ ల నిషేధాన్ని విధిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. సయ్యద్ అలీ ట్రోఫీలో భాగంగా కర్నాటకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అంబటి నిబంధనలు పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి11వ తేదీన జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డర్ మెహదీ హసన్ బాల్ ని ఆపే ప్రయత్నంలో పొరపాటున బౌండరీ లైన్ ని తాకాడు. కర్నాటక 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. తరువాత ఆట ప్రారంభించిన హైదరాబాద్ 203 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కర్నాటక కెప్టెన్ వినయ్  'బౌండరీ లైన్' విషయాన్ని థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లగా... ఆయన మరో 2 పరుగులు అదనంగా ఇచ్చారు. దీంతో కర్నాటక స్కోరు 205గా నమోదైంది. ఈ నేపథ్యంలో, అంపైర్లపై అంబటి రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ అయినా నిర్వహించాలని అంబటి రాయుడు పట్టుబట్టినా... అంపైర్లు అంగీకరించలేదు.


దీంతో, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలోనే ఉండిపోయారు. దీంతో, తర్వాత జరగాల్సిన ఆంధ్ర-కేరళ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమై...13 ఓవర్లకే ముగిసింది. దీనికి సంబంధించిన నివేదికను అంపైర్లు బీసీసీఐకి పంపించగా... బీసీసీఐ రాయుడిపై చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు రాయుడు అంగీకరించాడని... రెండు మ్యాచ్ ల నిషేధానికి అంగీకరించాడని బీసీసీఐ తెలిపింది.