తొలి మ్యాచ్‌లోనే సచిన్ కొడుకు డకౌట్
శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ డకౌట్ అయ్యాడు.
శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ డకౌట్ అయ్యాడు. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్ తొలి రోజే బౌలింగ్‌లో ఒక వికెట్ తీశాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రమే అందరి ఆశలను అడియాసలు చేస్తూ డకౌట్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్న అర్జున్ కొంచెం తడబడినట్లు కనిపించాడు.
ఆ తర్వాత లంక బౌలర్ దుల్షాన్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి ఎలాంటి పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే "డోంట్ వర్రీ అర్జున్" అన్న రీతిలో ఆ కుర్రాడికి సోషల్ మీడియాలో అభిమానులు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. చిత్రమేంటంటే.. సచిన్ కూడా 1989లో పాకిస్తాన్‌తో తొలి వన్డే ఆడినప్పుడు.. ఎలాంటి పరుగులు చేయకుండానే ఔట్ అవ్వడం గమనార్హం.
ప్రస్తుతం అండర్ 19 జట్టులో సభ్యుడైన అర్జున్ టెండుల్కర్, అనూజ్ రావత్ కెప్టెన్సీలో ఆడుతున్నాడు. తాజాగా శ్రీలంక అండర్ 19 జట్టుతో జరిగిన టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 134.5ఓవర్లలో 589 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.