దక్షిణాప్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక జట్టు ఆల్ రౌండర్ ధనుష్క గుణతిలకను అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. గుణతిలక కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తన నియమావళి)ను అతిక్రమించాడని టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన బోర్డు.. ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందన్న బోర్డు అధికారులు ఎంతకాలం సస్పెన్షన్ కొనసాగిస్తామనే విషయం మాత్రం వెల్లడించలేదు.


వివరాల్లోకి వెళితే.. కొలంబోలో క్రికెటర్లు బస చేస్తోన్న హోటల్ గదికి గుణతిలక, అతడి స్నేహితుడు (శ్రీలంక సంతతికి చెందిన బ్రిటన్ వ్యక్తి)కలిసి.. ఆదివారం తెల్లవారుఝామున ఇద్దరు నార్వే మహిళలను తీసుకెళ్లారు. అందులో ఓ మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధిత మహిళ నిందితునితో పాటు గుణతిలక కూడా రేప్ జరిగిన సమయంలో అదే హోటల్‌ గదిలోనే ఉన్నాడని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు క్రికెటర్ గుణతిలక స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నార్వే పర్యాటకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రాథమిక విచారణ  చేపట్టి.. 'కోడ్ ఆఫ్ కండక్ట్ (మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అర్ధరాత్రిలోగా హోటల్ రూమ్‌కి చేరుకోవాలి, అతిథులెవరితోనూ గడపొద్దు)' ను ఉల్లంఘించాడని రుజువుకావడంతో గుణతిలకను సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు రెండో టెస్టు మ్యాచ్ ఫీజును నిలిపేయాలని బోర్డు నిర్ణయించింది.