పంజాబ్ బౌలర్ల ధాటికి.. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఔట్..!
లక్ష్యం చిన్నదైనా తక్కువ పరుగులకే టాప్ ఆర్డర్ కూలిపోవడంతో ఓటమి నుండి తప్పించుకోవడం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకి కష్టమైంది.
లక్ష్యం చిన్నదైనా తక్కువ పరుగులకే టాప్ ఆర్డర్ కూలిపోవడంతో ఓటమి నుండి తప్పించుకోవడం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకి కష్టమైంది. వెనువెంటనే వికెట్లు టపా టపా పడిపోవడంతో చేతులెత్తేయడం తప్ప ఆ జట్టు పెద్దగా ఏమీ చేయలేదు.
వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలవెన్ పంజాబ్ జట్టులో కరుణ్ నాయర్ (34; 32 బంతుల్లో 4×4), మయాంక్ అగర్వాల్ (21; 16 బంతుల్లో 3×4), డేవిడ్ మిల్లర్ (26; 19 బంతుల్లో 1×4, 1×6), యువరాజ్ సింగ్ (14; 17 బంతుల్లో 1×4) తప్ప ఇంకెవరూ రాణించలేదు.
గేల్ స్థానాన్ని భర్తీ చేసిన ఆరోన్ ఫించ్ (2 పరుగులు) ముందుగానే అవుట్ అయిపోవడంతో కేవలం 143 పరుగులు మాత్రమే పంజాబ్ జట్టు చేయగలిగింది. ఈ క్రమంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప.. ఢిల్లీ విజయం ఖాయమనే అనేకమంది భావించారు.
అయితే అందరి ఊహలను తారుమారు చేస్తూ పంజాబ్ బౌలర్లు తమ సత్తా చూపారు. టాప్ ఆర్డర్ కూలిపోయినా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (57; 45 బంతుల్లో 5×4, 1×6) కొంత శ్రమించి జట్టుకి విజయాన్ని అందించాలని భావించాడు.
అలాగే పృథ్వీషా (22 పరుగులు) కూడా ఫర్వాలేదనిపించాడు. గేమ్ ఆఖరిలో రాహుల్ తెవాతియా (24; 21 బంతుల్లో 1×4, 1×6) కూడా కాస్త దూకుడుగా ఆడడానికి ప్రయత్నించాడు.
అయితే పంజాబ్ బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేయడంతో పాటు.. పకడ్బందీగా ఫీల్డింగ్ ప్లానింగ్ కూడా చేయడంతో చివరి ఓవర్ వరకూ మ్యాచ్ కాస్త గంభీరంగానే సాగింది. ఇక ఒక ఓవరులో ఢిల్లీ 18 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 12 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో ముజీవ్ ఉర్ రెహ్మాన్, ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్ రెండేసి వికెట్లు తీసి తమ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.