ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ స్టేడియంలో టీమిండియా ఆడిన రెండో టెస్ట్‌‌ భారత్‌కు ఘోర పరాజయాన్ని అందించింది. తొలుత ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌ చేయక తప్పింది కాదు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకి తొలి ఇన్నింగ్స్‌లోనే  భారత్ ఆటగాళ్లకు కోలుకోలేని షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 107 పరుగులకే అందరూ అవుట్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్, పూజారా లాంటి వారందరూ చేతులెత్తేయడంతో.. ఆశ్విన్ చేసిన 29 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. కోహ్లీ కూడా కేవలం 23 పరుగులే చేశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలుత కాస్త నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ విశ్వరూపం చూపించింది. వోక్స్(130), బెయిర్‌స్టో(93) తమ పరుగులతో స్టేడియంను హోరెత్తించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ 88.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.


ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడడానికి బరిలోకి టీమిండియా ఈసారి కూడా చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ల ధాటికి కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరూ పెవిలియన్ బాట పట్టారు. ఈసారి కూడా రవిచంద్రన్ అశ్విన్(33), హార్థిక్ పాండ్యా(26) తప్ప ఆటగాళ్లు ఎవరూ కూడా రాణించలేదు. మురళీ విజయ్, దినేష్ కార్తిక్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ లాంటి వారు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగారు. కోహ్లీ కూడా కేవలం 17 పరుగులే చేశాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్  2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.