బాల్ ట్యాంపరింగ్ వివాదంపై యూ టర్న్ తీసుకున్న హర్బజన్ సింగ్
బాల్ ట్యాంపరింగ్ వివాదంపై యూ టర్న్ తీసుకున్న హర్బజన్ సింగ్ అందరినీ అయోమయంలో పడేశాడు.
బాల్ ట్యాంపరింగ్ వివాదంపై యూ టర్న్ తీసుకున్న హర్బజన్ సింగ్ అందరినీ అయోమయంలో పడేశాడు. తొలుత బాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై చర్య తీసుకున్న ఐసీసీ.. స్మిత్‌ని ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వీలు లేకుండా నిషేధం విధించడంతోపాటు అతడి మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. బాన్‌క్రాఫ్ట్ విషయంలో 75 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతోపాటు మూడు డీమెరిట్ పాయింట్స్ జారీచేసింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మార్చి 25న హర్బజన్ సింగ్ స్పందిస్తూ.. ఇందులో బాన్‌క్రాఫ్ట్ పొరపాటు కూడా వుందని తెలిసిన తర్వాత కూడా అతడిని మ్యాచ్ నుంచి ఎందుకు నిషేధించలేదు అని ప్రశ్నించాడు. అంతేకాకుండా 2001లో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో తనతోపాటు మరో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లను ఎక్సెస్సివ్ అప్పిలింగ్ కింద సస్పెండ్ చేయడాన్ని గుర్తుచేసుకున్నాడు. 2008లో సంచలనం రేపిన 'మంకీగేట్' వివాదాన్ని నెమరేసుకున్న హర్బజన్ సింగ్.. అప్పట్లో ఆండ్రూ సైమండ్స్ నేరం రుజువు కాకపోయినా ఆ మ్యాచ్ రిఫరీ మైక్ ప్రొక్టర్ అతడిపై మూడు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం విధించాడు అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. మార్చి 25నాటి ట్వీట్‌లో ఇవన్నీ ప్రస్తావించిన హర్బజన్ సింగ్.. ఐసీసీ ఒక్కొక్కరికి ఒక్కోరకమైన తీర్పు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించాడు.
ఇదిలావుంటే, తాజాగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు నిషేధం విధించడంపై స్పందిస్తూ.. "ఒక ఆటగాడిని ఏడాదిపాటు ఆటకు దూరందా వుంచడం అనేది దారుణం" అని తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. " ఒకటో లేక రెండో మ్యాచ్‌ల నిషేధం విధిస్తే సరిపోతుంది కానీ ఇంత కఠిన నిర్ణయం కరెక్ట్ కాదు" అని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని తప్పుపట్టాడు.
సరిగ్గా ఇక్కడే హర్బజన్ సింగ్ ట్వీట్స్ కొందరిని అయోమయంలో పడేశాయి. మొదట ఐసీసీ తీర్పుని తప్పు పట్టిన హర్బజన్ సింగ్ ఇప్పుడిలా యూ టర్న్ తీసుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లను వెనకేసుకొస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డుని తప్పుపట్టడం ఏంటని సందేహం వ్యక్తంచేస్తున్నారు హర్బజన్ సింగ్‌లోని ఈ రెండు కోణాల్ని చూసిన నెటిజెన్స్.