Virat Kohli Tips to Yashasvi Jaiswal: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. 10 రోజుల ముందుగానే అక్కడికి చేరుకుని భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో ముమ్మరంగా ఉన్నారు. జూలై 12వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్‌ ప్రారంభం కానుంది. ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా రన్‌ మెషీన్ విరాట్ కోహ్లీ కోచ్‌గా మారాడు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు బ్యాటింగ్‌లో మెళకువలు నేర్పించాడు. యశస్వి జైస్వాల్ టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తుండడంతో తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెట్స్‌లో బ్యాటింగ్ చేసిన తర్వాత ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో విరాట్ కోహ్లీ ముచ్చటించాడు. అనంతరం యశస్వి జైస్వాల్ కోహ్లీతో సుదీర్ఘంగా చర్చించాడు. విండీస్‌తో టూర్‌కు ఛెతేశ్వర్‌ పుజారాను పక్కనబెట్టడంతో జైస్వాల్‌ను మూడోస్థానంలో ఆడించే అవకాశం కనిపిస్తోంది. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీల్లో అదరగొట్టిన జైస్వాల్.. తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. విండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌తోపాటు నిన్న ప్రకటించిన టీ20 సిరీస్‌కు కూడా జైస్వాల్ ఎంపికయ్యాడు.


 




రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. 14 మ్యాచ్‌లలో 625 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్‌లో 15 మ్యాచ్‌ల్లో  80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. అద్భుత ఫామ్‌తో జైస్వాల్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా తరుఫున బ్యాకప్ ప్లేయర్‌గా స్థానం లభించింది. ఇంగ్లాండ్‌లో ప్రాక్టీస్‌ సెషన్లు ఈ యంగ్ క్రికెటర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి.  


వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా:


ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.