ఇంగ్లండ్‌తో ఐదవ, ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడటానికి ముందు, భారత జట్టులో గతంలోనూ గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇప్పుడున్న జట్టులా అతి తక్కువ సమయంలో అత్యధిక విజయాలను సాధించలేదంటూ టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. వారిలో సౌరవ్‌ గంగూలీ, సునీల్‌ గావస్కర్‌, సెహ్వాగ్ ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ పరాజయానికి కోచ్ రవిశాస్త్రి అతి విశ్వాసమే కారణమని మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా తీవ్రస్థాయిలో చేస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. 'ఈ సిరీస్‌లో మేం అత్యుత్తమ జట్టుతోనే ఆడాము. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. ఓటమికి బాధ్యత పూర్తి జట్టుపై ఉంటుంది. కానీ ఒక్కరినే ఈ ఓటములకు బాధ్యుడిగా ప్రచారం చేయడం మంచిది కాదు.' అని పేర్కొన్నాడు.


‘ప్రస్తుత టీమిండియా ప్రయాణం అద్భుతంగా ఉంది. మంచి విజయాలను నమోదు చేస్తున్నారు. మూడేళ్లలో భారత జట్టు విదేశాల్లో 9 మ్యాచులు, మూడు సిరీస్‌లు గెలిచింది. గత 15-20 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించిన జట్టుని నేను చూడలేదు. గత జట్లలో గొప్ప ఆటగాళ్లు కూడా ఉన్నారు.’ అని  టీమిండియా కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.


రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ మండిపడ్డారు. అవి అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలని.. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీమిండియా తరఫున మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ, నేను, ఎంఎస్‌ ధోని లాంటి వాళ్లం ఆడాం. ఇప్పుడు అలాగే విరాట్‌ కోహ్లి ఆడుతున్నాడు. మేమందరమూ టీమిండియాకు చెందిన వాళ్లమే. ఆయా సమయాల్లో మేమందరమూ ఇండియా తరఫున ఆడాం. ఇలా ఒకతరం.. మరొక తరం క్రికెటర్లని పోల్చుతూ మాట్లాడడం సరికాదు. నేను కూడా చాలా మాట్లాడగలను. కానీ ఈ వ్యాఖ్యలు మంచిది కాదు. భారత్‌ కోసం విరాట్ సేన కష్టపడే ఆడుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.