భారత అంధుల క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వెళ్లి తాము క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 7 నుంచి 21 తేది వరకు దుబాయ్, పాకిస్తాన్ వేదికలుగా అంధుల క్రికెట్ ప్రపంచ కప్ జరగబోతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5వ తేదిన ఇదే టీమ్ దుబాయ్‌కి వెళ్లాల్సి ఉంది.


అయితే దుబాయ్ వెళ్లాక.. ఏదైనా తమ మ్యాచ్ పాకిస్తాన్‌లో పడితే అందుకు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం అనుమతి జారీ చేయకపోతే మాత్రం టీమ్ వెళ్లే అవకాశం ఉండదు. అందుకే ముందస్తుగానే భారత అంధుల క్రికెట్ టీమ్ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతోంది. ఈ జట్టు కెప్టెన్ అరవింద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "ఒకవేళ పాక్ వెళ్లే అవకాశం ఉంటే.. వాఘా సరిహద్దు మీదుగానే వెళ్లాలి. అనుమతి లేకపోతే దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి ఉంటుంది" అని ఆయన తెలిపారు.