IPL 2024 Auction: మరో వారం రోజుల్లో ఐపీఎల్ వేలం, అందరి దృష్టి ఆ నలుగురిపైనే
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. కేవలం వారం రోజులే వ్యవధి మిగిలుంది. ఈసారి వేలానికి 1166 మంది ఆటగాళ్లు సిద్ధమైనా అన్ని ఫ్రాంచైజీల దృష్టి మాత్రం ఆ నలుగురిపైనే పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Auction: మరో వారం రోజుల్లో అంటే డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. పది ఫ్రాంచైజీల మధ్య 77 స్థానాల కోసం 333 మంది పోటీ పడనున్నారు. ఎవరి సత్తా ఎంతో ఆ రోజే తేలనున్నా..ఆ నలుగురి ధర మాత్రం పీక్స్‌కు చేరవచ్చని అంచనా ఉంది. ఆ నలుగురు ఎవరో చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలానికి దుబాయ్ సిద్ధమైంది. డిసెంబర్ 19న పది ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొననున్నాయి. ఇప్పటికే వివిధ ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్లు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు వెలువరించడంతో ఎవరి వద్ద ఎవరున్నారు, ఎంత వ్యాలెట్ మిగిలుందో తేలిపోయింది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు వేలానికి సిద్ధమైతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం 333 మందితో తుది జాబితా విడుదలైంది. వీరిలో 119 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మొత్తం పది ఫ్రాంచైజీలకు కలిపి కావల్సిన ఆటగాళ్ల సంఖ్య 77. అంటే 333 మందిలో 77 మందిని ఎంచుకోనున్నారు. ఎవరి ధర ఎంతనేది వేలంలో తేలనుంది. అయితే ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన ఆ నలుగురిపైనే అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ఎంతైనా ఖర్చు పెట్టి ఆ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమౌతున్నాయి.
వీరిలో మొదటి స్థానంలో ఉంటాడు ఆస్ట్రేలియాకు టైటిల్ అందించడంలో కీలక భూమిక వహించిన ఆసీస్ ఆల్ రౌండర్ ట్రావిస్ హెడ్. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తుండటంతో అందరి దృష్టి ఇతనిపైనే ఉంది. ఇక రెండవ స్థానంలో న్యూజిలాండ్ తురుపుముక్క మరో ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఉన్నాడు. మరో ఇద్దరు కూడా ఆసీస్ ఆటగాళ్లే. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లు కూడా ఈసారి వేలంగా భారీ ధర పలకనున్నారు. ఈ నలుగురి కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ నలుగురిపై కోట్ల రూపాయలు కురవనున్నాయి.
వ్యాలెట్ పరంగా అత్యధికంగా డబ్బున్నది గుజరాత్ టైటాన్స్ వద్ద. 38.15 కోట్లున్నాయి. అయితే వీరికి కావల్సిన ఆటగాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. 10 మంది అవసరం. కాబట్టి జాగ్రత్తగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక కేకేఆర్‌కు కావల్సిన ఆటగాళ్ల సంఖ్య 12 కాగా వ్యాలెట్‌లో ఉన్నది 32.70 కోట్లే. అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వ్యాలెట్‌లో కేవలం 13.15 కోట్లున్నాయి. ఇంకా ఆరుగురు ఆటగాళ్లు అవసరం ఈ జట్టుకు.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరుగురు ఆటగాళ్లు కావల్సి ఉంటే వ్యాలెట్‌లో 23.25 కోట్లు మాత్రమే మిగిలాయి. హైదరాబాద్ జట్టుకు కూడా ఆరుగురే కావల్సి ఉన్నా వ్యాలెట్‌లో 34 కోట్లు ఉండటంతో కీలక ఆటగాళ్లను దక్కించుకునే అవకాశాలున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు కూడా అవకాశాలెక్కువ. వీరికి కూడా కావల్సిన ఆటగాళ్ల సంఖ్య 6 కాగా వ్యాలెట్‌లో 31.4 కోట్లున్నాయి. ఇక ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు 9 మంది ఆటగాళ్లు కావల్సి ఉంటే వ్యాలెట్‌లో 28.95 కోట్లున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు 8 మంది ఆటగాళ్లు కావాలి కానీ వ్యాలెట్‌లో కేవలం 17.75 కోట్లే ఉండటంతో మేనేజ్ చేయడం కష్టమే కావచ్చు.
ఇక పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు 8 మంది ఆటగాళ్లు కావల్సి ఉంటే వ్యాలెట్‌లో 29.1 కోట్లున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సైతం 8 మంది ఆటగాళ్లు కావల్సి ఉండగా వ్యాలెట్‌లో కేవలం 14.5 కోట్లే మిగిలాయి. ఓవరాల్‌గా చూస్తే మొత్తం 77 మంది ఆటగాళ్లకు కలిపి 10 ఫ్రాంచైజీల వ్యాలెట్‌లో 262.95 కోట్లున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook