CSK vs GT IPL 2023 Finals: ఐపీఎల్‌ 2023 ఫైనల్ పోరుకి రంగం సిద్ధమైంది. ఫైనల్లో నాలుగుసార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది టైటిల్‌ విజేత గుజరాత్‌ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన చెన్నైకెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.  ఏ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'వర్ష సూచన ఉన్నందున ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాం. ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్‌ నిర్వహణ సాధ్యంకాక.. మేం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాం. అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ రోజు వారిని మేం అలరిస్తామని ఆశిస్తున్నా' అని ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు. 'టాస్‌ గెలిస్తే మేం కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం. నా హృదయం బ్యాటింగ్ వైపు మొగ్గు చూపింది. టాస్ ఓడిపోయినా పట్టించుకోవడం లేదు. మంచి ఆటతీరును కనబర్చిన జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది. మా ఆటగాళ్లు బాగా ఆడతారని ఆశిస్తున్నా' అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. 


ఆదివారం జరగాల్సిన ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ వర్షం కారణంగా నేటికి వాయిదా పడింది. సోమవారం కూడా అహ్మదాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పినప్పటికీ ప్రస్తుతం వాతావరణం బాగానే ఉంది. మ్యాచ్‌ నిర్వహణకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి. 


తుది జట్లు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానె, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌, వికెట్‌కీపర్), దీపక్ చాహర్, మతీశా పతిరన, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.
గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్‌), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్‌ షమీ.