హ్యాపీ బర్త్ డే ఇర్ఫాన్ పఠాన్
బౌలింగ్‌లో సూపర్ స్వింగర్లు వేయాలంటే ఆ కుర్రాడే వేయాలి... చాలామంది ఫాస్ట్ బౌలింగ్‌లో తనను కపిల్ దేవ్‌తో పోలుస్తారు.. అంతేకాదు మిడిల్ ఆర్డర్‌లో జట్టుకి ఉపయుక్తమైన బ్యాట్స్‌మన్ కూడా.. అయితేనేం వరుస గాయాలు అతని కెరీర్‌ను దెబ్బతీశాయి.. అయినప్పటికీ అలుపెరగని ధీరుడిలా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం కోసం ప్రయత్నిస్తూ.. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో తనదైన శైలిలో రాణిస్తున్న ఆ క్రికెటర్ మరెవరో కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ స్వింగ్ హీరో.. ఇర్ఫాన్ పఠాన్. ఈ రోజు ఆయన 33వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
27 అక్టోబరు 1984 తేదీన గుజరాత్‌లోని వడోదరాలో ఒక పఠాన్ కుటుంబంలో పుట్టిన ఇర్ఫాన్‌కు చిన్నప్పటి నుండీ క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. తన సోదరుడు యూసుఫ్‌తో కలిసి తన ఇంటికి దగ్గరగా ఉండే మసీదు ప్రాంగణంలో క్రికెట్ ఆడేవాడు. ఇర్ఫాన్ తండ్రి స్థానిక మసీదులో ముజీన్‌గా పనిచేసేవాడు. తన పిల్లలను కూడా ఇస్లామిక్ స్కాలర్స్ చేయాలని భావించాడు. అయితే వారు క్రికెట్ పట్ల పెంచుకున్న మక్కువగా చూసి, అందులోనే వారు తగిన శిక్షణ తీసుకొనేలా ప్రోత్సహించాడు.
భారత జట్టు మాజీ కెప్టెన్ దత్తా గైక్వాడ్ ఆధ్వర్యంలో పఠాన్ సోదరులు చిన్నతనంలో క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఆ తర్వాత బరోడా క్రికెట్ జట్టుకి అండర్ 14 విభాగంలో ఎంపికయ్యాడు. ఆ తర్వాత వరుసగా అండర్ 15,16 జట్టులో కూడా స్థానం సంపాదించి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 1999లో మహారాష్ట్ర అండర్ 15 జట్టుకి ఎంపికైన ఇర్ఫాన్, ఒక్క సంవత్సరంలోనే అండర్ 15 భారత జట్టుకి ఎంపికయ్యాడు.
దేశవాళీ క్రికెట్‌లో 2001లో బరోడా తరఫున ఆడాడు పఠాన్. జహీర్ ఖాన్ భారత జట్టుకి ఎంపికవ్వడంతో అతని బదులుగా టీమ్‌లో స్థానం సంపాదించాడు ఇర్ఫాన్. ఆ టీమ్ తరఫున రంజీ ట్రోఫీలో సత్తా చాటిన ఇర్ఫాన్, 2002లో అండర్ 19 భారత జట్టుకి ఎంపికై, ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ పై 6 వికెట్లు తీసి యువ సంచలనమయ్యాడు. ఆ తర్వాత అదే టీమ్ తరఫున ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లి మూడు యూత్ టెస్టు్ల్లో 15 వికెట్లు తీసి మళ్లీ సెలక్టర్ల కనుసన్నల్లో పడ్డాడు. 2003లో భారత జట్టు - ఎ తరఫున ఇంగ్లాండ్ వెళ్లిన ఇర్ఫాన్ దక్షిణాఫ్రికాపై అయిదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. అదే సంవత్సరం అండర్ 19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు
2003 సంవత్సరం పఠాన్ జీవితంలో మర్చిపోలేనిది. అదే సంవత్సరం డిసెంబరులో తొలిసారిగా ఆస్ట్రేలియాతో భారత టెస్టు జట్టు తరఫున ఆడే అవకాశం అతనికి దక్కింది. 19 ఏళ్ళ వయసులో తొలి టెస్టు ఆడిన ఇర్ఫాన్ ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తన కెరీర్‌లో ఇప్పటికి 120 వన్డేలు ఆడిన ఇర్ఫాన్ 173 వికెట్లు తీశాడు. అలాగే అతని ఖాతాలో అయిదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే 29 టెస్టులు ఆడి, 100 వికెట్లు తీసిన ఘనత కూడా ఇర్ఫాన్‌దే. అయితే వరుస గాయాల కారణంగా 2008లో దక్షిణాఫ్రికాపై తన ఆఖరి టెస్టు ఆడిన ఇర్ఫాన్.. 2012లో శ్రీలంకపై తన ఆఖరి వన్డే ఆడాడు.
ఆ తర్వాత కొంతకాలం క్రికెట్‌కు స్వస్తిచెప్పి, 2015లో "ఝలక్ దికలాజా" అనే డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు ఇర్ఫాన్ రికార్డుల విషయానికి వస్తే ఇర్ఫాన్ పేరు మీద చాలానే ఉన్నాయి. అతి తక్కువ రోజుల్లో అనగా 1059 రోజుల్లో వన్డేల్లో 1000 పరుగులు చేసి, 100 వికెట్లు తీసిన రికార్డు ఇంకా ఇర్ఫాన్ పేరు మీదే ఉంది. అలాగే అతి తక్కువ కాలంలో అనగా 59 మ్యాచ్‌లు ఆడి 100 వికెట్లు తీసిన మొదటి భారతీయ క్రికెటర్ రికార్డు కూడా ఇర్ఫాన్ పేరు మీదే ఉంది. ఇర్ఫాన్ తన తొలి టెస్టు సెంచరీ 2007లో పాకిస్తాన్ పై చేశాడు.
ఇర్ఫాన్ పఠాన్ "క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్" అనే క్రికెట్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. యువ పఠాన్ క్రికెటర్లకు కోచింగ్ ఇవ్వడం కోసం ప్రారంభించిన ఈ అకాడమీకి గ్రెగ్ ఛాపెల్ లాంటి వారు సలహాదార్లుగా ఉన్నారు.
ప్రస్తుతం దేశవాళీ మ్యాచ్‌లతో పాటు కొంతకాలం ఐపీఎల్ మ్యాచ్‌లలో కూడా ఆడిన పఠాన్, భారత జాతీయ జట్టులోకి రావడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి సెలక్టర్ల దృష్టి ఈ ఎవర్ గ్రీన్ క్రికెటర్‌పై పడుతుందో లేదో కాలమే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ ఇర్ఫాన్ పఠాన్..!