ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ పై క్రమశిక్షణ చర్యలలో భాగంగా మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ ప్రకటించారు. టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో ఆండర్సన్ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లకు తాకడంతో ఆయన అపీల్ చేశారు. అయితే ఎంపైర్ ధర్మసేన అపీల్‌ను తిరస్కరించి నాటౌట్‌గా ప్రకటించారు. కానీ ఆండర్సన్ మళ్లీ రివ్యూ చేయాల్సిందిగా థర్డ్ ఎంపైర్‌ని కోరాడు. కానీ థర్డ్ ఎంపైర్ కూడా ధర్మసేనకు నిర్ణయాన్ని వదిలేయడంతో.. కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో అసహనానికి గురైన ఆండర్సన్.. ధర్మసేన వద్దకు వెళ్లి కోపంతో మాట్లాడాడు. ఆ తర్వాత కోహ్లీ వైపు తిరిగి తన అసహనాన్ని వెల్లగక్కాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లు ఆండర్సన్ ప్రవర్తనపై రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత జరిగిన విచారణలో ఆండర్సన్ తన తప్పిద్దాన్ని ఒప్పుకోవడంతో ఆయనకు జరిమానా విధించారు. అలాగే అతి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నట్లు తెలిపారు. 


2014లో ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీని ఆండర్సన్ నాలుగుసార్లు అవుట్ చేయడం గమనార్హం. అయితే ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఒక్కసారి కూడా ఆండర్సన్ కోహ్లీని అవుట్ చేయలేదు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీతో వివాదం జరిగిన తర్వాత... మరో రెండు ఓవర్లలోనే పూజారాను, రహానేను పెవిలియన్‌కు పంపించాడు ఆండర్సన్. ప్రస్తుతం భారత్ పై ఎక్కువ వికెట్లు తీసిన అంతర్జాతీయ బౌలర్‌గా ఆండర్సన్ రికార్డులకు కెక్కాడు. ఈ క్రమంలో ఆయన ఇదే ఘనత సాధించిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ రికార్డును బ్రేక్ చేశాడు.