కార్డిఫ్: ప్రపంచ కప్‌లో భాగంగా కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌కి దిగింది. జేసన్ రాయ్ 153 పరుగులు(121 బంతుల్లో), జాస్ బట్లర్ 64 పరుగులు(44 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో 51 పరుగులు(50) చెలరేగి ఆడటంతో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ 386 పరుగులు చేసింది. 387 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 280 పరుగులే ఆలౌట్ అయింది. 


బంగ్లాదేశ్ ఆటగాళ్లలో షకీబ్ అల్ హసన్ 121 పరుగులు(119 బంతుల్లో), ముష్ ఫికర్ రహీమ్ 44 పరుగులు (50 బంతుల్లో), మహ్మదుల్లా 28 పరుగులు (41 బంతుల్లో) మినహా మిగతా ఎవ్వరూ ఆకట్టుకునే ప్రదర్శనను కనబర్చలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ చేతిలో 106 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌కి ఓటమి తప్పలేదు.