Jyothi Surekha: అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ(vennam Jyoti surekha) సత్తా చాటింది. పోటీపడిన మూడు విభాగాల్లోనూ పతకాల పంట పండించింది. కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల జట్టు, మిక్స్‌డ్‌ టీమ్‌లోనూ రజతాలు(Silver) సొంతం చేసుకుంది. ఈ మూడు విభాగాల్లోనూ భారత ఆర్చర్లు కొలంబియా(Colombia) చేతిలోనే ఓడిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యక్తిగత విభాగంలో..
శనివారం వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 144-146 తేడాతో సారా లోపెజ్‌ (Sarah Lopez‌)చేతిలో పరాజయం పాలైంది. టాప్‌ సీడ్‌ ప్రత్యర్థితో పోరులో ఆరో సీడ్‌ సురేఖ గట్టి పోటీనే ఇచ్చినప్పటికీ ఆధిక్యం మాత్రం సాధించలేకపోయింది. తొలి సెట్‌లో 29-28తో ఒక పాయింట్‌ వెనకబడ్డ సురేఖ.. రెండో సెట్లో 29-29తో సమం చేసి పుంజుకున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత మూడు సెట్లలోనూ ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. మ్లినారిచ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సురేఖ 150కి 150 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. 


Also Read; Womens Cricket: ఉత్కంఠ పోరులో భారత్‌పై ఆసీస్ విజయం..సిరీస్‌ కంగారూలదే..


కాంపౌండ్‌ విభాగంలో..
కాంపౌండ్‌ మహిళల జట్టు పసిడి పోరులో ఏడో సీడ్‌ భారత్‌ 224-229 తేడాతో టాప్‌ సీడ్‌ కొలంబియా చేతిలో ఓడింది. సురేఖ, ముస్కాన్‌, ప్రియలతో కూడిన భారత్‌.. తొలి సెట్‌ను 58-58తో సమం చేసి ప్రత్యర్థికి దీటుగా బదులిచ్చింది. కానీ రెండో సెట్‌ నుంచి పైచేయి సాధించలేకపోయింది. చివరి రెండు సెట్లలో కొలంబియా ఆర్చర్లు 12 బాణాలకు గాను ఎనిమిది సార్లు పది పాయింట్లు సాధించగా.. భారత్‌ ఆరు సార్లే ఆ లక్ష్యాన్ని చేరుకుంది.


మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో..
మిక్స్‌డ్‌ టీమ్‌లో అయిదో సీడ్‌ అభిషేక్‌ వర్మ- సురేఖ జోడీ 150-154తో మునోజ్‌- లోపెజ్‌ చేతిలో ఓడింది. తొలి సెట్లో  39-38తో మంచి ఆరంభాన్ని దక్కించుకున్న భారత ద్వయం.. ఆ తర్వాత స్థాయికి  తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. ముఖ్యంగా మూడో సెట్లో భారత్‌ 36-40తో దెబ్బతింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మిక్స్‌డ్‌ విభాగంలో దేశానికిదే తొలి పతకం.


రికార్డులు
* ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు రజతాలు సాధించిన తొలి భారత ఆర్చర్‌ సురేఖ. ఈ టోర్నీ చరిత్రలో వ్యక్తిగత, జట్టు, మిక్స్‌డ్‌ విభాగాల్లో పతకాలు సాధించిన ఏకైక భారత్‌ ఆర్చర్‌ ఆమెనే.
* ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సురేఖ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. 2017లో టీమ్‌ రజతం, 2019లో వ్యక్తిగత, టీమ్‌ కాంస్యాలు, 2021లో మూడు వెండి పతకాలు గెలిచింది.
* ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో ఇప్పటివరకూ భారత్‌ సాధించిన పతకాలు 11. అందులో ఏడు పతకాలు కాంపౌండ్‌ విభాగంలో రాగా.. అందులో ఆరు పతకాల్లో సురేఖ భాగస్వామ్యం ఉంది.
*  తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జ్యోతి సురేఖ 41 అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి మొత్తం 36 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 16  రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి