ఐసిసి ప్రపంచ కప్‌లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్స్‌కి చేరిన న్యూజిలాండ్ జట్టు ఆనందానికి అవదుల్లేవు. 18 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. దీంతో ఆ జట్టు కెప్టేన్ కేన్ విలియమ్సన్ పట్టలేనంత సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. కేవలం 10 ఓవర్లకే 24 పరుగులకే 4 వికెట్లు తీసి మట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ టీమిండియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడమే కివీస్ విజయానికి బాటలు వేసినట్టయింది. 


ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై న్యూజిలాండ్ జట్టు కెప్టేన్ కేన్ విలియమ్సన్ స్పందిస్తూ.. మ్యాచ్ లో తమ జట్టు ఆటగాళ్లు చూపించిన పోరాటపటిమ, మానసిక స్థైర్యం, తెగువ గొప్పవని అన్నాడు. బౌలింగ్‌లో కివిస్ బౌలర్లు మొదటి నుంచి చూపించిన అద్భుతమైన ప్రతిభే.. జట్టుకు అసలైన శక్తిని అందించింది. కివీస్ బౌలర్ల నుంచి ఏమైతే ఆశించామో అది లభించింది. అయితే, అదే సమయంలో భారత ఆటగాళ్లు సైతం గొప్ప ప్రతిభే కనబర్చారు. ఆరంభంలోనే 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. భారత జట్టు గెలిచేందుకు తీవ్రంగా కృషిచేయడం గొప్ప విషయం అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నట్టుగా ఐసిసి వెల్లడించింది. ఏదేమైనా.. ఇరు జట్లు కూడా ఏదో ఒక దశలో బ్యాటింగ్, బౌలింగ్‌లో తమ ప్రతిభను కనబర్చేందుకు కృషిచేశాయని విలియమ్సన్ అభిప్రాయపడినట్టుగా ఐసిసి ప్రకటన స్పష్టంచేసింది.