కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అతడిని పక్కన పెట్టి తప్పు చేస్తోందా ?
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో ఏ ఆటగాడినైతే చూసి ఆ జట్టు ప్రత్యర్థులు భయపడుతున్నారో.. ఆ ఆటగాడినే రిజర్వ్ బెంచ్‌కి పరిమితం చేసింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో ఏ ఆటగాడినైతే చూసి ఆ జట్టు ప్రత్యర్థులు భయపడుతున్నారో.. ఆ ఆటగాడినే రిజర్వ్ బెంచ్‌కి పరిమితం చేసింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో అతడిని రిజర్వ్‌డ్ ప్లేయర్‌గానే వాడుకున్న పంజాబ్ జట్టు.. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఆట విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ ఆటగాడు ఇంకెవరో కాదు.. వెస్ట్ ఇండీస్‌కి చెందిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. అవును, క్రిస్ గేల్‌కి ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డ్ వుంది. పైగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో బెంగుళూరులో ఏ మైదానంలోనైతే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు మ్యాచ్ తలపడనుందో.. అదే గడ్డపై ఒకప్పుడు ఐపీఎల్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన చరిత్ర క్రిస్ గేల్ సొంతం. 2013లో ఏప్రిల్ 23న అప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో ఆటగాడిగా వున్న క్రిస్ గేల్.. అప్పటి తమ ప్రత్యర్థి జట్టు అయిన పూణె వారియర్స్‌పై 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
క్రిస్ గేల్ సత్తా ఏంటో తెలిసిన జట్టు కావడంతో విరాట్ కోహ్లీ సేన అతడిని ఎలా ఎదుర్కోవాలా అని తీవ్రంగా ఆలోచించింది. అందుకు అవసరమైన బౌలింగ్ అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుని క్రిస్ గేల్‌ని పెవిలియన్ బాట పట్టించడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ప్రత్యేకమైన పథకాలే రచించుకుందని టాక్ కూడా వినిపించింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకి చివరకు అంత శ్రమ లేకుండానే క్రిస్ గేల్‌ని రిజర్వ్‌డ్ ప్లేయర్‌గా ప్రకటించింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు. దీంతో ఒకవిధంగా అస్సలు ఏమీ కష్టపడకుండానే ఒక ప్రమాదం నుంచి రాయల్ ఛాలెంజర్స్ జట్టు బయటపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రిస్ గేల్ లాంటి విధ్వంసకరమైన ఆటగాడిని ఈ మ్యాచ్‌కి కూడా పక్కన పెట్టి కింగ్స్ ఎలెవెన్ జట్టు తప్పు చేస్తోందా అని సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది.