Kolkata Knight Riders Win By 4 Runs Vs Sunrisers Hyderabad: నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. హెన్రిచ్ క్లాసెన్ ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడిన వేళ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. చివరి బంతికి ఓటమికి తలవంచింది. కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి.. టోర్నీలో ఖాతా తెరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. రస్సెల్ (64 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. సాల్ట్ (54), రమణ్‌దీప్ సింగ్ (35) రాణించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 204 పరుగులు చేసింది. క్లాసెన్ (63) వీరబాదుడుకు తోడు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఆరంభంలో దూకుడుగా ఆడారు. చివరి మూడు ఓవర్లలో 60 పరుగులు చేయాల్సి ఉండగా.. క్లాసెన్ విశ్వరూపం చూపించాడు. వరుసగా సిక్సర్లు బాది లక్ష్యాన్ని దగ్గరగా తీసుకువచ్చాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉండగా.. క్లాసెన్ ఔట్ అయ్యాడు. ఆఖరి బంతికి కమిన్స్ పరుగులు చేయలేకపోవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: PBKS Vs DC Highlights: పంత్ రీఎంట్రీ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి.. సొంతగడ్డపై రెచ్చిపోయిన పంజాబ్    


209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి హైదరాబాద్‌కు ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (21 బంతుల్లో 32, 4 ఫోర్లు, ఒక సిక్స్‌), అభిషేక్‌ శర్మ (19 బంతుల్లో 32, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.3 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. రాహుల్ త్రిపాఠి (20), మార్క్రామ్ (18), అబ్దుల్ సమాద్ (15) విఫలమైనా.. హెన్రిచ్ క్లాసెన్‌ (29 బంతుల్లో 63, 8 సిక్సర్లు) కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. షాబాద్ అహ్మద్ (5 బంతుల్లో 15, ఒక ఫోర్, 2 సిక్సులు) కూడా చివర్లో దూకుడుగా ఆడాడు. చివరి ఓవర్‌కు 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హర్షిత్ రాణా వేసిన తొలి బంతినే క్లాసెన్ సిక్సర్‌గా మలిచాడు. ఐదు బంతుల్లో 7 పరుగులే చేయాల్సి ఉండడంతో ఎస్‌ఆర్‌హెచ్‌దే విజయం అనుకున్నారు. 


రెండో బంతికి క్లాసెన్ సింగిల్ తీయగా.. మూడో బంతికి షాబాద్ అహ్మద్ భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. మూడు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. మూడో బంతికి జాన్సన్ సింగిల్ తీశాడు. 2 బంతుల్లో 5 రన్స్ అవసరం అవ్వగా.. ఐదో బంతికి క్లాసెన్ అవుటయ్యాడు. చివరి బంతికి కమిన్స్ పరుగులు ఏమి చేయలేదు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 204 పరుగుల వద్దే ఆగిపోయింది. 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3, రస్సెల్ 2, వరుణ్‌ చక్రవర్తి, నరైన్ చెరో వికెట్ తీశారు.


అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్‌ (40 బంతుల్లో 54, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదగా.. చివర్లో ఆండ్రీ రస్సెల్‌ (25 బంతుల్లో  64 నాటౌట్, 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాల్ పడితే బౌండరీనే అన్నట్లు ఊచకోత కోశాడు. రమణ్‌దీప్‌ సింగ్‌ (35), రింకూ సింగ్‌ (23) కీలక రన్స్ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో నటరాజన్‌ 3 వికెట్లు తీయగా.. మార్కండేకు రెండు వికెట్లు దక్కాయి.


Also Read:  V Hanumanth Rao: రేవంత్ రెడ్డి రెండు సైడ్ లు వినాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ.హనుమంత రావు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter