నిదహాస్ టీ-20 ముక్కోణపు సిరీస్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా రాణించి టీమిండియా విజయానికి బాటలు వేసిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. 'టీ-20 ఫైనల్స్‌లో ఒకే ఒక బంతి మిగిలివుండగా ఆ బంతినే సిక్సర్‌గా మలిచి, మ్యాచ్‌ను ఒక మలుపు తిప్పిన దినేష్ ఘనతను తాను స్వయంగా చూడలేకపోయాన' ని కెప్టెన్ రోహిత శర్మ అన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియాకు ఓటమి ఖాయమని అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోతుండగా.. దినేష్ కార్తీక్ ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడని రోహిత్ అన్నాడు. ఇంతవరకు ఇలాంటి మంచి గేమ్‌ను అతను ఆడి ఉండకపోవచ్చునని, కానీ తన శక్తి ఏమిటో నిరూపించి స్టేడియంకు వచ్చిన అశేష జనసమూహాన్ని అలరించాడని ప్రశంసల జల్లు కురిపించాడు. ''నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా చివరి ఓవర్ ఆఖరి బంతిని నేను ఎప్పటికీ మర్చిపోను'' అని కార్తీక్ పేర్కొన్నాడు.


12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కార్తీక్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 29 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. దాన్ని సిక్సర్‌కు తరలించి మ్యాచ్ గెలిపించాడు.


అంతకుముందు దినేశ్ కార్తీక్ తన విజయానందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ''ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి విషయాలు జీవితాంతం గుర్తిండిపోతాయి. చాలా సంతోషంగా ఉంది'' అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.