భారత్‌ను చూసి పాక్ నేర్చుకోవాలి : సొంత దేశంపైనే పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో భారత్ చేతిలో రెండుసార్లు ఓటమి చెంది, ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చనందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంత దేశం నుంచే విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ విషయంలో పాక్ కోచ్ మికీ ఆర్థర్ స్పందిస్తూ.. పాక్ ఓపెనర్లు, బౌలర్లు, భారతీయ ఆటగాళ్లను చూసి వాళ్లు ఎలా అయితే తమ విధానాలను అమలు చేస్తున్నారో అలా ఆడటం నేర్చుకోవాలి అని అన్నాడు. ఈ మొత్తం వివాదంపై పాక్ మాజీ కెప్టేన్, ప్రస్తుతం జట్టులో ఆడుతున్న షోయబ్ మాలిక్ సైతం పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముందుగా పాకిస్తాన్ పొరుగుదేశమైన భారత క్రికెట్ ఎంపిక విధానాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని షోయబ్ అన్నాడు.
ఒక జట్టు ఎదుగుతున్న దశలో దానికి కొంత సమయం అవసరం. కానీ ఆలోపే ఎంతో నష్టం జరిగిపోయినట్టు భయాందోళనలు చెంది, ఆటగాళ్లను మార్చేయడం సరికాదు. అలా కాకుండా జట్టులో చాలామంది ఆటగాళ్లను ఒక్కసారే మార్చేస్తే, ఆ కొత్త ఆటగాళ్లు కుదురుకోవడానికి కూడా మళ్లీ కొంత సమయం పడుతుంది. అదే భారత్‌లో అయితే, ఎంపిక అలా ఉండదు. అందుకే భారత్‌లో క్రికెట్ విధానాలను చూసి పాక్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని షోయబ్ కుండబద్ధలు కొట్టినట్టు తేల్చిచెప్పాడు. భారత క్రికెటర్ల ఎంపిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. అక్కడ ఆటగాళ్లపై విశ్వాసంతో వారికి తమ సత్తా నిరూపించుకునే అవకాశం ఇస్తారు అని షోయబ్ మాలిక్ అభిప్రాయపడ్డాడు.