దుబాయ్‌‌‌‌లో ఈ మధ్యకాలంలో భారత్, పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగిన సమయంలో.. మైదానంలో ఓ పాకిస్తానీయుడు భారత జాతీయ గీతాన్ని పాడడానికి ప్రయత్నించడం విశేషం. ఇరు దేశాల మధ్య శాంతి ఫరిడవిల్లాలని భావిస్తూ తాను ఆ గీతాన్ని పాడానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ గీతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తొలుత పాకిస్తాన్ జాతీయ గీతం వచ్చినప్పుడు ఆ గీతాన్ని పాడిన ఆయన.. తర్వాత భారతీయ జాతీయ గీతం ప్లే చేసినప్పుడు.. దానిని కూడా పాడడానికి ప్రయత్నించాడు. తాను జాతీయ గీతం పాడుతున్న వీడియోని తానే వీడియో తీసిన ఆ వ్యక్తి తర్వాత.. దానిని యూట్యూబ్ ఇత్యాది ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్‌లో అప్ లోడ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ గీతం పాడినప్పుడు అక్కడక్కడ పదాలు సరిగ్గా పలకడం రాకపోయినా.. ఆయన చేసిన ప్రయత్నానికి మాత్రం నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇప్పటికే కొన్ని లక్షలమంది ఆన్ లైన్‌లో ఈ వీడియోని వీక్షించడం జరిగింది. ఈ గీతాన్ని పాడిన పాకిస్తానీయుడి పేరు ఆదిల్ రాజ్. ఆయన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయత్నాలు ముందు ముందు మరిన్ని చేస్తానని తెలిపారు. 


తాను తొలిసారిగా భారత జాతీయ గీతాన్ని ఓ బాలీవుడ్ సినిమాలో విన్నానని తెలిపారు ఆదిల్ రాజ్. ఆ తర్వాత అదే గీతం తనకు పదే పదే వినాలనిపించిందని అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతిని కాంక్షించే తను ఈసారి మ్యాచ్‌కు వచ్చేటప్పుడు ఇరు దేశాల జెండాలను కలిపి ధరించి వస్తానని అన్నారు. ఇలాంటి పాజిటివ్ పనులు చేయడానికి తాను ఎప్పటికీ సిద్ధమే అని అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే క్రీడలే ఇరుదేశాలను కలపడానికి ప్రయత్నిస్తున్నాయని.. రెగ్యులర్ సిరీస్ మ్యాచ్‌లు భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగితే తాను సంతోషిస్తానని ఆయన అన్నారు.