క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు భారత క్రికెటర్ పర్విందర్ అవానా(31) ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ఈ ఢిల్లీ పేస్ బౌలర్ ట్విటర్ లో పేర్కొన్నారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఐదు రోజుల తరువాత అవానా ఆటకు గుడ్‌బై చెప్పడం కొసమెరుపు .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీకి తొమ్మిదేళ్లపాటు ప్రాతినిథ్యం వహించిన ఆవానా..2012లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లను ఆడాడు. కానీ ఈ బౌలర్ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. 2012-2014 మధ్య ఐపీఎల్‌లో 3 సీజన్ల పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడాడు. అవానా 62 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 29.23 సగటుతో 191 వికెట్లు పడగొట్టాడు. అవానా చివరిసారిగా 2016 నవంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు.


ఈ సందర్భంగా ట్విటర్‌లో క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన లేఖను పోస్ట్ చేశాడు. 'టీమిండియా, ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశమిచ్చిన సెలక్టర్లకు, సీనియర్లకు థాంక్స్. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.