భారతీయ బ్యాడ్మింటన్‌ దిగ్గజం పీవీ సింధు ఈ రోజు అద్భుతంగా ఆడి తన అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా పసిడి వేటకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకున్న సింధు ఫైనల్‌‌లో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో తలపడనుంది. సెమీ ఫైనల్‌లో జపాన్‌ షట్లర్‌ యమగూచితో జరిగిన ఆసక్తికరమైన పోరులో 21-16, 24-22 తేడాతో విజయాన్ని నమోదు చేసిన సింధు ఇంకొక్క మ్యాచ్‌ గెలిస్తే చాలు.. ఈ మెగా ఈవెంట్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని మరో చరిత్రను తిరగరాసినట్లవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీస్‌లో సింధు, యమగూచిలకు మధ్యలో జరిగిన మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఇద్దరూ క్రీడాకారిణులు కూడా పోటీపోటీగా సవాళ్లు విసురుకుంటూ.. చక్కని ప్లేస్‌మెంట్లలతో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. ఇద్దరూ ఇద్దరమే అన్నట్లు అసలు తగ్గకుండా రణరంగంలో సైనికుల్లా పోరాడారు. తొలి ఆటలో 5 పాయింట్ల వరకు యమగూచి తన ఆధిపత్యాన్ని కనబరిచి సింధుకి సవాలు విసిరింది. 


అయితే ఒకానొక సందర్భంలో మైండ్ గేమ్ దిశగా ఆట వెళ్తున్నట్లు అనిపించింది. సింధు వరుసగా పాయింట్లు సాధించి, యమగూచికి షాక్ ఇవ్వడంతో స్కోరు 8-8తో సమమైంది. ఆ తర్వాత 12-12 వరకు ఇద్దరూ క్రీడాకారిణులు కూడా నువ్వా.. నేనా అన్నట్లు ఆడి చెరొక పాయింట్ సాధించారు.


ఆ తర్వాత ఆట పూర్తిగా సింధు పక్షంగా మారింది. ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తూ చెలరేగి ఆడిన సింధు.. వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18-12 స్కోరుతో పూర్తిగా ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత యమగూచి ప్రయత్నించినా.. సింధు దూకుడుకి కళ్లెం వేయలేకపోయింది. ఫలితంగా సింధు 21-16తో ఆటను గెలిచింది.