ఐపీఎల్ 2018లో భాగంగా నేడు ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న 42వ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు తరుపున ఆడిన రిషబ్ పంత్ అద్దిరిపోయే పర్‌ఫార్మెన్స్ కనబర్చాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌పై 128 పరుగులు చేసి (63 బంతుల్లో 15X4, 7 X6) నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్ ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డ్ కైవసం చేసుకున్నాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు వాస్తవానికి ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కనీసం పాతిక పరుగులైనా రాకముందే 4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు రిషబ్ పంత్. 


ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో మిగతా ఆటగాళ్లు అంతా ఒక్కొక్కరుగా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ బాట పడుతున్నప్పటికీ.. రిషబ్ పంత్ మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి ఢిల్లీ జట్టు స్కోరుని 187 పరుగులకు చేర్చాడు. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌పై దాదాపు దాడికి దిగినంత పనిచేసిన రిషబ్‌ పంత్‌  56 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.