క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రాజ్యసభ సభ్యత్వం ఇటీవలే ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తనకు వచ్చిన జీతాన్ని, అలవెన్సులను మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశారు. ఈ ఆరు సంవత్సరాలకు కలిపి సచిన్ టెండుల్కర్‌కు మొత్తం 90 లక్షల రూపాయల వరకు వేతనం లభించడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మొత్తాన్ని ఈయన పీఎం రిలీఫ్ ఫండ్‌కు తిరిగి ఇచ్చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. సచిన్ తీసుకున్న నిర్ణయం చాలా ఆదర్శంతో కూడిన నిర్ణయమని.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తామని ఈ ప్రకటనలో పీఎంఓ ఆఫీసు అధికారులు తెలిపారు. సచిన్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆయన అనేక కార్యక్రమాలకు వినియోగించారు.


ఈ ఆరేళ్ళలో ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చిన రూ.30 కోట్ల నిధులను ఆయన వివిధ పనులు చేయడానికి ఉపయోగించారు. సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం క్రింద రెండు గ్రామాలను ఆయన దత్తత తీసుకొని.. అక్కడ రోడ్లు వేయించడంతో పాటు నీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలాగే కాశ్మీరు ప్రాంతంలో స్కూలు కట్టడానికి కూడా ఎంపీ ల్యాడ్స్ నిధులను ఆయన ఉపయోగించారు. ఆంధ్రప్రదేశ్‌‌‌లోని పుట్టంరాజు కండ్రిగ గ్రామం ఆయన దత్తత తీసుకున్న గ్రామాల్లో ఒకటి.