గంగూలీ ఏదోఓరోజు ముఖ్యమంత్రి అవుతారు: సెహ్వాగ్
భారత జట్టు మాజీ సారథి, `దాదా` సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ జోస్యం చెప్పారు.
భారత జట్టు మాజీ సారథి, 'దాదా' సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ జోస్యం చెప్పారు. గంగూలీ రచించిన 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకావిష్కరణ కార్యక్రమందేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి వీరూ, యూవీ వచ్చారు. ఈ సందర్భంగా వీరూ మాట్లాడుతూ.. దాదా ఏదోఓరోజు పశ్చిమ బెంగాల్ సీఎం అవుతారని అన్నారు. సీఎం కంటే ముందు గంగూలీ బీసీసీఐకి అధ్యక్షుడు కూడా అవుతాడని అన్నారు.
నాటి ఓ ఘటనను వీరూ గుర్తు చేసుకుంటూ.. ‘ఓసారి మ్యాచ్ అయిపోయాక దాదా విలేకరుల సమావేశానికి వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో తన బ్యాగును సర్దాల్సిందిగా అతడు మమ్మల్ని ఆదేశించాడు. మేమేమో జట్టులో జూనియర్లం. ఆయన సీనియర్..పైగా కెప్టెన్. దాంతో ఆయన ఆదేశాన్ని పాటించక తప్పలేదు’ అని చెప్పారు. దీనిపై స్పందించిన గంగూలీ ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు. నేను చెప్పానని వాళ్లు అలా ఏమీ చేయలేదు. మ్యాచ్ అయిపోగానే పోవాల్సి ఉండటం వల్లే నా బ్యాగునూ సర్దారు’ అని అన్నారు. పక్కనే ఉన్న యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. జూనియర్ క్రికెటర్లకు సౌరవ్ ఎంతో అండగా నిలిచేవాడన్నారు. ‘కెప్టెన్‌గా ఉన్నప్పుడు నాకు అద్భుత జట్టు లభించింది. యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా ఆడేలా ఎంకరేజ్ చేశాను’ అని గంగూలీ అన్నారు.