ప్రస్తుతం క్రికెట్ క్రీడను కుదిపేస్తోన్న బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్యాంపరింగ్ అనేది ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదని, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదేనని కుండబద్ధలు కొట్టిన శ్రీశాంత్... ఆ విషయం ఇండియన్ క్రికెటర్స్‌కి కూడా తెలుసు అని మరో బాంబు పేల్చాడు. ఈ సందర్భంగా గతంలో తనపై ఐసీసీ జీవిత కాలంపాటు నిషేధం విధించడాన్ని గుర్తుచేసుకున్న శ్రీశాంత్.. ఈ వివాదంపై ఐపీఎల్ సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయం అని, క్రికెట్ లెజెండ్స్ ఈ అంశంపై నోరు విప్పాలని కోరాడు. బాల్ ట్యాంపరింగ్ అనేది క్లబ్ స్థాయి మ్యాచుల్లోనూ జరుగుతోంది అని అన్నాడు శ్రీశాంత్. 2013లో స్పాట్-ఫిక్సింగ్ కేసులో పట్టుబడిన శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


ట్యాంపరింగ్ గురించి భారతీయ ఆటగాళ్లకు కూడా తెలుసునని చెప్పిన శ్రీశాంత్ అంతటితో సరిపెట్టుకోకుండా.. అలా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఐసీసీ, బీసీసీఐలే తేల్చుకోవాలని వ్యాఖ్యానించడం చర్చనియాంశంగా మారింది. ముఖ్యంగా ఈ వివాదానికి క్రికెట్ లెజెండ్స్ దూరంగా వుండకుండా, ఇకనైనా నోరు విప్పితే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డాడు శ్రీశాంత్. శ్రీశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!!