సన్‌రైజర్స్ కెప్టేన్ డేవిడ్ వార్నర్ కొనసాగింపుపై స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్
బాల్ ట్యాంపరింగ్ కేసులో మరో కీలక పాత్ర పోషించిన ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్ జట్టులో కెప్టేన్సీ స్థానం వున్నట్టా లేక హుష్‌కాకీ అయినట్టా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న ఐపీఎల్ సీజన్‌లో స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం, అతడి స్థానంలో అజింక్య రహానేని నియమించడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇక ఇదే బాల్ ట్యాంపరింగ్ కేసులో మరో కీలక పాత్ర పోషించిన ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్ జట్టులో కెప్టేన్సీ స్థానం వున్నట్టా లేక హుష్‌కాకీ అయినట్టా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వార్నర్ కొనసాగింపుపై వినిపిస్తున్న సందేహాలపై స్పందించిన సన్‌రైజర్స్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్.. " డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏం నిర్ణయం తీసుకుంటుందో అప్పటివరకు వేచిచూస్తాం అని స్పష్టంచేశారు. నిన్నగాక మొన్నే ఈ వివాదం వెలుగుచూసింది. ఇప్పుడప్పుడే దీనిపై స్పందించడం సన్‌రైజర్స్‌కి తొందరపాటే అవుతుంది. అందుకే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తాం" అని అన్నారు.
ఒకవేళ వార్నర్‌పై చర్య తీసుకుని అతడిని ఆ పదవి నుంచి తప్పించాల్సి వస్తే.. కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే విషయంలో జట్టు యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ తర్వాతి స్థానంలో కెప్టేన్‌గా శిఖర్ ధావన్, కేన్ విలియంసన్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.