ఒలంపిక్స్ లో రెండుసార్లు మెడల్స్ సొంతం చేసుకున్న సుశీల్ కుమార్ మరోసారి ఆదివారం అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో తన సత్తా చాటుకున్నాడు. సౌత్ ఆఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్ లో సుశీల్ కుమార్ స్వర్ణ పతకం సొంతం చేసుకుని భారత్ కి గర్వ కారణంగా నిలిచాడు. మూడేళ్ల తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న సుశీల్ కుమార్.. న్యూజిలాండ్ కి చెందిన రెజ్లర్ ఆకాష్ ఖుల్లర్ పై 74 కేజీ ఫ్రీ స్టైల్ కేటగిరీ ఫైనల్లో గెలుపొందడం ద్వారా ఈ గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014లో గ్లాస్కోలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న సుశీల్ కుమార్ ఆ తర్వాత మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో మరో మెడల్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న అనంతరం ట్విటర్ ద్వారా స్పందించిన సుశీల్ కుమార్.. తాను సొంతం చేసుకున్న ఈ గోల్డ్ మెడల్ ని తన గురువు, దేశానికి అంకితం చేస్తున్నాను అని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా రెజ్లింగ్ జాతీయ పర్యవేక్షకుడి పదవికి సైతం వెంటనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు సుశీల్. ప్రస్తుతం క్రీడల్లో చురుకుగా వున్న వారు ఈ పదవిలో కొనసాగకూడదనే నిబంధన మేరకు సుశీల్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


2016 రియో ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెల్చుకుని దేశానికి పేరు తీసుకొచ్చిన ముగ్గురు మహిళా క్రీడాకారుల్లో ఒకరైన సాక్షి మాలిక్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. ఇదే కామన్ వెల్త్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్ లో ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఈసారి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారామె. న్యూజీలాండ్ కి చెందిన టేలా టౌహిన్ పై 62 కేజీల ఉమెన్స్ ఫ్రీ స్టైల్ కేటగిరిలో 13-2 తేడాతో విజయం సాధించిన సాక్షి మాలిక్ ఈ పోటీల్లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్ అందించారు. యాదృశ్చికంగా సాక్షి మాలిక్, సుశీల్ కుమార్ ఇద్దరూ గెలిచింది న్యూజీలాండ్ కి చెందిన రెజ్లర్లపైనే కావడం ఇక్కడ మరో విశేషం.