క్రికెట్‌లో బంగ్లాదేశ్ పేరు చెప్పగానే పసికూన అనే భావన మదిలో ఎక్కడో మెదులుతుంది. గతంలో ఆ జట్టు ఎన్నో పర్యాయాలు మేజర్ టోర్నీల్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న జట్లకు సైతం ముచ్చెమటలు పట్టించింది. కానీ గతంలో ఒక్క మేజర్ టోర్నీ కూడా గెలవలేదు. వన్డే ప్రపంచ కప్, ట్వంటీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను అటు బంగ్లాదేశ్ జట్టుగానీ, ఇటు అండర్ 19 టీమ్‌గానీ గెలిచిన దాఖలాలు లేవు. దీంతో ఈ ఫైనల్‌కు ముందు బంగ్లాపై అంతగా అంచనాలు లేవు. దీంతో బంగ్లా జట్టును భారత అండర్ 19 జట్టు తేలికగా భావించి ఉండవచ్చు. ఫలితం ఆదివారం జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో పటిష్టమైన భారత్‌పై చారిత్రక విజయం సాధించి అండర్ 19 ప్రపంచ కప్‌ను బంగ్లాదేశ్ టీమ్ ఎగరేసుకుపోయింది. సీనియర్ల జాతీయ జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిన మేజర్ టోర్నీ యువ ఆటగాళ్లు కైవసం చేసుకున్నారు. తమది పసికూన జట్టు కాదని జూనియర్ టీమ్ నిరూపించుకుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అండర్ 19 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో చరిత్రలో భారత్ అత్యధికంగా 7 పర్యాయాలు ఫైనల్ చేరుకుంది. నాలుగు పర్యాయాలు కప్పు చేజిక్కుంచుకోగా, ఫిబ్రవరి 10న జరిగిన ఫైనల్‌తో సహా మూడు పర్యాయాలు తడబాటుకు లోనైంది. బంగ్లాను బేబీలుగా ట్రీట్ చేస్తే ఏమవుతుందో వరల్డ్ కప్ ఫైనల్‌ ఫలితంతో ఆ జట్టు చెప్పకనే చెప్పింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూల్చింది. బంగ్లా జట్టు ఛేజింగ్ చేస్తుండగా 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్‌ నిలిపివేశారు. అప్పటికి బంగ్లాదేశ్‌ స్కోరు 163/7. 



వర్షం తగ్గాక బంగ్లాదేశ్‌ లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 46ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. కెప్టెన్‌ అక్బర్‌ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్‌) చివరివరకూ పోరాడటంతో బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఏ మేజర్ టోర్నీలోనైనా బంగ్లాదేశ్ తొలిసారి సగర్వంగా ప్రపంచ కప్ సాధించింది. భారత్ చివరి 7 వికెట్లను కేవలం 22పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. బంగ్లా కెప్టెన్ అక్బర్‌ అలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. భారత బౌలర్ రవి బిష్ణోయ్‌ (6 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కాగా, చివరి 6 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో 5 పర్యాయాలు ఛేజింగ్ చేసిన జట్టునే విజయం వరించింది.



210–220 పరుగులు చేయాల్సింది: భారత కెప్టెన్‌
‘మా బౌలర్లు చక్కగా పోరాడారు. కానీ ఫైనల్‌ మాకు కలిసిరాలేదు. తక్కువ లక్ష్యమే అయినప్పటికీ బౌలర్ల వల్లే చివరివరకు పోరాడగలిగాం. బ్యాటింగ్‌లో మంచి ఆరంభం లభించినా వినియోగించుకోలేకపోయాం. మేం 210–220 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండేది. మా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని’ ఫైనల్ అనంతరం భారత కెప్టెన్ ప్రియమ్‌ గార్గ్ అభిప్రాయపడ్డాడు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..