వరల్డ్ కప్ టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంపై జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఓటమిని మిగిల్చిన మ్యాచ్ ఫలితంపై తీవ్ర ఆవేదనను వ్యక్తంచేసిన విరాట్ కోహ్లీ... ''45 నిమిషాల చెత్త ప్రదర్శన టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్స్‌లో స్థానం కోల్పోయేలా చేసింది" అని అన్నాడు. మంగళవారం నాటి మ్యాచ్‌‌లో టీమిండియా బౌలర్ల ప్రతిభ చూశాకా ఇక ఈ మ్యాచ్ మనదేననే నమ్మకం కలిగింది. కానీ రిజర్వ్ డే రోజు మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోయింది. వాస్తవానికి కివీస్ బౌలర్లు తమ సత్తా చాటుకున్నారు. కివీస్ ఆటగాళ్లు ఈ విజయానికి అర్హులనే చెప్పొచ్చు అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా కష్టకాలంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు చూపించిన తెగువ అభినందించదగినది అని కేన్స్ విలియమ్సన్ జట్టుపై కోహ్లి ప్రశంసలు గుప్పించాడు. 


Also read: వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమిపై స్పందించిన ప్రధాని మోదీ


టీమిండియా లక్ష్య సాధనలో చూడటానికి కివీస్ నిర్ధేశించిన 240 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం తేలికగానే అనిపించినప్పటికీ.. తొలి 3.1 ఓవర్లలోనే కేవలం 5 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతోనే టీమిండియా పతనానికి పునాధి పడినట్టయింది. ఒకానొక దశలో ఆరంభంలోనే చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ను మళ్లీ ధోని (50 పరుగులు), రవింద్ర జడేజా (77) నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆఖరికి మ్యాచ్ ఫలితం టీమిండియాను వెక్కరిస్తూ న్యూజిలాండ్ చెంత చేరడం టీమిండియా క్రికెట్ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేసింది.