రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు ఆ జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన ప్రతిభ కనబర్చడంలో విఫలమైనందుకు కోహ్లీ పశ్చాత్తాపం వ్యక్తంచేశాడు. ఈ సీజన్‌లో తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా వుందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదు అని ఆవేదన వ్యక్తంచేస్తూ కోహ్లీ గురువారం ఓ వీడియో సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ప్లేఆఫ్స్ వరకు కూడా వెళ్లకుండానే టోర్నీ నుంచి వెనుదిరగాల్సి రావడంపై విరాట్ కోహ్లీలో ఆవేదన చాలా స్పష్టంగా కనిపించింది. బలహీనమైన బౌలింగ్, నిలకడ లేని బ్యాటింగ్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు ఓడిపోయింది. బ్యాటింగ్‌లోనూ ఎక్కువగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి వారిపైనే జట్టు అధికంగా ఆధారపడటం వంటివి ఆ జట్టుకు సమస్యలుగా పరిణమించాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అభిమానులకు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో నిరాశపర్చకుండా చూసుకుంటామని అభిమానులకు హామీ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా వెళ్లకుండానే వెనుదిరిగినప్పటికీ.. ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల పట్టికలో 548 పరుగులతో (54.80 సగటుతో) కోహ్లీ ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఇదే జట్టుకు చెందిన విధ్వంసకరమైన బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ 480 పరుగులతో (53.33 సగటు) 9వ స్థానంలో నిలిచాడు.