కోహ్లీ ఖాతాలో 100 సెంచరీలు ..ఎలగెలగా?
విరాట్ కోహ్లీ రాశి, వాసి అద్భుతంగా ఉన్నాయని.. ఆయన మళ్లీ భారత్‌కు టీ20 వరల్డ్ కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా తీసుకొస్తాడని నాగపూర్‌కి చెందిన నరేంద్ర భుండే అనే జ్యోతిష్కుడు బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.
విరాట్ కోహ్లీ రాశి, వాసి అద్భుతంగా ఉన్నాయని.. ఆయన మళ్లీ భారత్‌కు టీ20 వరల్డ్ కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా తీసుకొస్తాడని నాగపూర్‌కి చెందిన నరేంద్ర భుండే అనే జ్యోతిష్కుడు బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఆయనను చాలా మంది క్రికెట్ జ్యోతిష్కుడు అని సంభోదిస్తూ ఉంటారు. ఇదే జ్యోతిష్కుడు గతంలో ధోని 2019 వరల్డ్ కప్‌లో కూడా ఆడతాడని చెప్పడం గమనార్హం.
ఇదే జ్యోతిష్కుడు మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేయడం విశేషం. ఇప్పటి వరకు సచిన్ పేరు మీద ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డుని కూడా కోహ్లీ బ్రేక్ చేస్తాడని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఎవరూ ఊహించని అతి పెద్ద ఎండార్స్‌మెంట్ డీల్‌కి కోహ్లీ సైన్ చేయబోతున్నాడని కూడా జోస్యం చెబుతున్నాడీయన. గతంలో బంగారు షాపు ఉద్యోగిగా పనిచేసిన భుండే.. 2006 నుండీ క్రికెటర్లకు జోస్యం చెబుతున్నాడు.
గతంలో గంగూలీ, మురళీ కార్తిక్, శ్రీశాంత్, జహీర్ ఖాన్, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్ లాంటి ఆటగాళ్లు భుండేతో జోస్యం చెప్పించుకున్న వారిలో ఉన్నారు. అదేవిధంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులకు కూడా ఈయన జోస్యం చెప్పారు. కింగ్స్ ఇలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా కూడా భుండేని సలహాలు అడిగారని పలువురు చెబుతుంటారు. ఏదేమైనా.. ఆయన చెబుతున్న దాంట్లో ఎంత సత్యం ఉందన్న విషయం పక్కన పెడితే.. క్రికెటర్లకు సెలబ్రిటీ జ్యోతిష్కుడు అయిపోయాడు భుండే.