మహిళల హాకీ ప్రపంచకప్‌లో భాగంగా.. ఆదివారం భారత్ వర్సెస్ అమెరికా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. గ్రూప్‌- బి నుంచి నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే  భారత్ ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాలి. లేకుంటే ఇంటిబాట పట్టాల్సిందే! కనీసం అమెరికాతో జరిగే మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే మంచిది లేదా గెలిస్తే మరీ మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్‌... రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ చేతిలో 0–1తో పరాజయం పాలైంది. ఐర్లాండ్‌పై గెలిచివుంటే నేరుగా భారత్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరేది.


ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లోని జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరతాయి. మిగతా నాలుగు స్థానాలను క్రాస్‌ఓవర్‌ పోటీతో భర్తీచేస్తారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లలో ఎవరు గెలిస్తే వాళ్లు క్వార్టర్స్‌కు వెళ్తారు.


ఇప్పటికే గ్రూప్‌ ‘బి’ నుంచి ఐర్లాండ్‌ 6 పాయింట్లతో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... ఇంగ్లండ్‌ 2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చెరో పాయింట్‌ సాధించిన భారత్, అమెరికా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గాలి లేదంటే కనీసం డ్రా చేసుకోవాలి. అప్పుడు భారత్‌ మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటుంది.