20 బంతుల్లో.. 102 పరుగులు చేసిన క్రికెట్ వీరుడు
భారతీయ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఈ రోజు అరుదైన రికార్డు కైవసం చేసుకున్నాడు.
భారతీయ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఈ రోజు అరుదైన రికార్డు కైవసం చేసుకున్నాడు. జేసీ ముఖర్జీ ట్రోఫీలో భాగంగా ఈ రోజు మోహన్ బగన్ బెంగాల్, నాగ్‌పూర్ రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 102 పరుగులు చేసి ఓ కొత్త రికార్డు నెలకొల్పాడు. అందులో 14 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా.. మోహన్ బగన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సాహా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పేసర్ అమన్ ప్రొసాద్ వేసిన ఏడో ఓవర్లో సాహా ఏకంగా 37 పరుగులు రాబట్టడం విశేషం.
20 బంతుల్లో వృద్ధిమాన్ సాహా 102 పరుగులు చేయగా.. ఇందులో 100 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చినవి కావడం గమనార్హం. అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్‌ల్లో చూసుకుంటే.. టీ20ల్లో అతి తక్కువ బాల్స్‌లో సెంచరీ సాధించిన రికార్డు క్రిస్‌గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ 2013 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్న సందర్భంలో పుణె వారియర్స్‌పై 30 బంతుల్లో సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.