సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు `ఆయుత ధర్మదీక్ష`
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగిన `ఆయుత ధర్మ దీక్ష`లో 26,000 మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగిన 'ఆయుత ధర్మ దీక్ష'లో 26,000 మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పాల్గొన్నారు. వారు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించేంత వరకు తమ ఆందోళనను తీవ్రతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎంతవరకైనా వెళ్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
"సమావేశాన్ని నిర్వహిస్తామని మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తే.. చివరి నిమిషంలో రద్దు చేశారు. అయినా మేము హైకోర్ట్ ద్వారా అనుమతి పొందాము. మొదట మేము ర్యాలీలో 10,000 మంది పాలుపంచుకుంటారని భావించాం.కానీ స్వచ్చందంగా 26,000 మంది ఉద్యోగులు పాలుపంచుకుంటున్నారు. ఈ సీపీఎస్ వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎలా బాధపడుతున్నాయో ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది " అని టీఎస్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగారపు స్థితప్రజ్ఞ అన్నారు. ఈ సంఘం 31 జిల్లాల నుంచి 100 మంది ఉద్యోగులను ఎన్నుకుంటుంది. వీరు సీపీఎస్ దుష్ప్రభావాలపై అవగాహన ఏర్పరుస్తారు.
"సీపీఎస్ రద్దు కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి 1.26 లక్షల మంది ఉద్యోగులతో ఉద్యమాన్ని త్వరలో ప్రారంభిస్తాం. మేము విధులను బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. సమ్మె కొనసాగితే, మా జీతం పోతుందని తెలుసు. అయినా సీపీఎస్ రద్దు చేసేంతవరకు తిరిగివెళ్లము" అని స్థితప్రజ్ఞ ప్రకటించారు.
"కొంతమంది ఉద్యోగుల సంఘాలు కొత్త పీఆర్సీ సమస్యను ముందుకు తీసుకెళ్ళడం ద్వారా మా ఆందోళనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మేము ఆందోళనలు చేస్తే కొత్త పిఆర్సీ రాదు అని వారు రూమర్లు సృష్టిస్తున్నారు. మేము కొత్త పీఆర్సీ, ఓపిఎస్ రెండింటిపై పోరాడతాము' అని స్థితప్రజ్ఞ అన్నారు. సీపీఎస్ ఉద్యోగులు, కుటుంబాలు రిటైర్ అయ్యాక పెన్షన్ పొందకపోతే సామాజిక, ఆర్ధిక భద్రత కోల్పోతారని.. ఉద్యోగి చనిపోతే వారికి ఎటువంటి సహాయం అందకుండా పోతాయని చెప్పారు.