రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను విస్మరిస్తోందని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.3వేల పింఛన్‌ అందజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. తెలంగాణలో గడీల పాలనకు తెరదించి గరీబుల పాలన తీసుకొస్తామని ఆయన అన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలో అడుగుపెట్టగానే రూ.2లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయడంతో పాటు ప్రతీ ఏటా వడ్డీలను కూడా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.


బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్యయాత్ర బుధవారం మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కొనసాగింది. జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేటల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో లక్ష్మణ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు. కేంద్రం నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ అనే కంపెనీలో బీసీలకు స్థానం లేదని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.