తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం ఖారరైంది. తాజా విధానాన్ని అనుసరించి రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త జిల్లాల ప్రకటన నేపథ్యంలో జోన్ల వ్యవస్థను పూర్తిగా పునర్విభజించాల్సిన వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం ఈ మేరకు జోనల్ విధానాన్ని ఖారారు చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలను ఏడు జోన్‌లుగా, జోన్లను రెండు మల్టీ జోన్‌లుగా విభజించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జోన్ల వివరాలు:
కాళేశ్వరం జోన్       : భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
బాసర జోన్           : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
రాజన్న జోన్          : కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
భద్రాద్రి జోన్          : కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
యాదాద్రి జోన్        : సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ
చార్మినార్ జోన్       : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
జోగులాంబ జోన్     : మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్


మల్టీ జోన్లు:
కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి 
యాదాద్రి, చార్మినార్, జోగులాంబ 


జోన్ల విధానంపై భారీ కసరత్తు
జోన్ల విధానంపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేసిన అనంతరం ఐఏఎస్ అధికారుల కమిటీ కసరత్తు చేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలోనూ జోనల్‌ విధానంపై చర్చించారు. ఇందుకు సంబంధించి టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ నేతృత్వంలో సంప్రదింపుల కమిటీని కేసీఆర్‌ ఏర్పాటుచేశారు. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకొంది. వాటన్నింటి ఆధారంగా ఈ రోజు సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తెలంగాణలో జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థలను ఖరారు చేశారు. 


రేపు టీజీవో భవవన్ భేటీ
కొత్త జోనల్ విధానం పై చర్చించేందుకు శుక్రవారం టీజీవో భవన్‌లో సమావేశం జరగనుంది. ఉద్యోగుల సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్‌ పంపనున్నారు. జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థకు కేబినెట్‌ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపనున్నారు. 


అన్యాయం జరగనివ్వం - కేసీఆర్


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్‌ వెల్లడించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ వివరించారు . దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలను ఏడు జోన్‌లుగా, జోన్లను రెండు మల్టీ జోన్‌లుగా విభజించారు.