CM Revanth Reddy: తెలంగాణకు అరుదైన అవకాశం.. హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్
Center for Fourth Industrial Revolution in Hyderabad: హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభం కానుంది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు.
Center for Fourth Industrial Revolution in Hyderabad: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది.
స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. అనంతరం సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు విశిష్ట సహకారం అందించింది.
‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరింది. జీవన విధానాలు, జీవన నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నాం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలున్నాయని చెప్పారు. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
‘హెల్త్ టెక్ హబ్‌గా తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చటంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను అందించే సంకల్పంతో పని చేస్తుంది..’ అని సీఎం వెంట దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
‘హెల్త్ టెక్, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తుకు నాయకత్వం వహించేందుకు సరిపడేన్ని అవకాశాలెన్నో భారతదేశానికి ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. ప్రపంచంలోనే మొదటి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా C4IR ఏర్పాటుతో తెలంగాణ మరింత కీలకంగా మారనుంది. ప్రభుత్వ రంగంతో పాటు స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మధ్య సమన్వయ సహకారం కుదర్చటంతో పాటు ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) విభాగంలో ఉద్యోగాల కల్పనకు మద్దతుగా నిలుస్తుంది.
ఫోరమ్ అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న డిజిటల్ హెల్త్‌కేర్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యం నెరవేరుతుందనే విశ్వాసముంది. దీంతో రోగులకు మెరుగైన సేవలు అందించడం, అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక విధానాలకు చొరవ చూపుతుందనే నమ్మకముంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ కేంద్రం ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రభావాన్ని మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తుంది..’ అని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ హెడ్, ఎగ్జ్క్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ శ్యామ్ బిషెన్ సంతోషం వ్యక్తం చేశారు.
C4IR గురించి
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (4IR) నెట్‌వర్క్ అయిదు ఖండాలలో విస్తరించింది. C4IR తెలంగాణ సెంటర్.. ప్రపంచంలో 19వది. హెల్త్‌కేర్ మరియు లైఫ్ సైన్సెస్ నేపథ్యంతో ఉన్నమొదటి కేంద్రం హైదరాబాద్లోనే ప్రారంభమవనుంది. ఆసియాలోనే తెలంగాణ ప్రముఖ లైఫ్ సైన్సెస్ హాట్‌స్పాట్‌గా పరిగణిస్తారు. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ పాలసీల రూపకల్పన, వాటి అమలుకు నాయకత్వం వహిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంక్యుబేటర్ల ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 20,000 స్టార్టప్‌లపై ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో దాదాపు సగం మంది ఉద్యోగులు ఫార్మా, మెడ్‌టెక్ మరియు బయో టెక్నాలజీ రంగాలలో పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ C4IR ప్రారంభంతో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఆరోగ్య సంరక్షణలో కొత్త సాంకేతిక విధానాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆవిష్కరణలకు స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.