One Family One Ticket: రేవంత్ రెడ్డి,ఉత్తమ్, భట్టి,కోమటిరెడ్డికి షాక్! టీపీసీసీలో రచ్చేనా?
One Family One Ticket: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వాళ్లను పరేషాన్ చేస్తోంది.
One Family One Ticket: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వాళ్లను పరేషాన్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తున్న ఏఐసీసీ పెద్దలు.. వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాకింగ్ గా మారింది. ఇది పార్టీలో రచ్చ రాజేసే అవకాశం ఉందనే ఆందోళన టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శివిర్ నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మూడు రోజులు జరుగుతున్న సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది ఒక కుటుంబం- ఒకటే టికెట్ రూల్. ఇకపై జరిగే ఎన్నికల్లో ఫ్యామిలీలో ఒకరికే పోటీ చేసే అవకాశం కల్పించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనకు చింతన్ శివిర్ లో ఏకాభిప్రాయం వచ్చింది. దీంతో ఇకపై కాంగ్రెస్ నుంచి ఫ్యామిలీలో ఒకరే పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ రూలే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు సంబంధించి చాలా మంది కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అలాంటి నేతలకు ఏఐసీసీ నిర్ణయం పరేషాన్ గా మారింది.
పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఉన్నారు. ఆయన సతీమణి పద్మావతి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో దంపతులిద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఉత్తమ్ గెలిచినా.. పద్మావతి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయంతో పద్మావతికి షాక్ తప్పదు. పద్మావతి పోటీ చేస్తే ఉత్తమ్ తప్పుకోవాల్సిందే. నల్గొండ జిల్లాకు సంబంధించి సీనియర్ నేత కోమటిరెడ్డి కుటుంబానికి ఇదే సమస్య. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు సీనియర్ నేతలే. వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉండగా.. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం కుటుంబంలో ఒకరే పోటీ చేయాల్సి వస్తే.. ఎవరూ బరిలో ఉంటారన్నది పెద్ద సమస్యే. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఉంది.
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు ఇదే పెద్ద సమస్యగా మారనుంది. విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూల్ ఎంపీగా పలుసార్లు గెలిచాడు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీలో ఒకరికే టికెట్ వస్తే.. ఆయన పోటీ చేయడం కష్టమే. రవి పోటీ చేయాలంటే విక్రమార్క త్యాగం చేయాల్సిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన సతీమణి నిర్మలను మెదక్ ఎంపీగా పోటీ చేయించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఆమె జిల్లాలో జోరుగా తిరుగుతున్నారు కూడా. అయితే పార్టీ తాజా రూల్ తో ఇద్దరిలో ఒకరికే పోటీ చేసే అవకాశం వస్తుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తాజా నిబంధన ఇబ్బందికరమే అంటున్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. గతంలో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కొడంగల్ కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారట. కొడంగల్ నుంచి రేవంత్ సోదరుడు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయంతో రేవంత్ రెడ్డి సోదరుడికి అవకాశం లేనట్టే.
ఫ్యామిలీలో ఒకరికే టికెట్ నిబంధన టీపీసీసీలో రచ్చగా మారే అవకాశం ఉందనే ఆందోళన గాంధీభవన్ లో వ్యక్తమవుతోంది. సీనియర్ నేతల కుటుంబాల్లో చిచ్చు రేగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మినహాయింపులు ఇవ్వడం కూడా కష్టమేనని తెలుస్తోంది. ఒకరికి ఇస్తే.. మిగితా వాళ్లకు ఇవ్వాల్సి వస్తుంది.. కాబట్టి ఎవరికి మినహాయింపు ఉండకపోవచ్చని అంటున్నారు.
READ ALSO: Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?
READ ALSO: TSRTC City Bus: ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి తర్వాత కూడా సిటీ బస్సులు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.