Asaduddin Owaisi on NRC and NPR : ఎన్పిఆర్పై రెండు రోజుల్లోగా టీఆర్ఎస్ వైఖరి: అసదుద్దీన్ ఒవైసి
జాతీయ పౌర పట్టిక (NRC)పై రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఎన్‌పిఆర్ (NPR)కి ఎన్ఆర్‌సి (NRC)కి పెద్ద తేడా లేదని.. ఎన్ఆర్సీని అమలు చేయడానికి కేంద్రం ఎన్‌పిఆర్‌ని మొదటి అస్త్రంగా వాడుతోందని ఆరోపించారు.
హైదరాబాద్: జాతీయ పౌర పట్టిక (NRC)పై రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఎన్‌పిఆర్ (NPR)కి ఎన్ఆర్‌సి (NRC)కి పెద్ద తేడా లేదని.. ఎన్ఆర్సీని అమలు చేయడానికి కేంద్రం ఎన్‌పిఆర్‌ని మొదటి అస్త్రంగా వాడుతోందని ఆరోపించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ముస్లిం నేతల సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసదుద్దీన్ ఒవైసి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపిఎంతో పాటు కలిసివచ్చే పార్టీల నాయకులను సభకు ఆహ్వానిస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. నిజామాబాద్ సభలో పాల్గొనాల్సిందిగా టిఆర్ఎస్ మంత్రులకు ముఖ్యమంత్రి మా ముందే చెప్పారని ఒవైసి పేర్కొన్నారు.
కలిసొచ్చే పార్టీలతో కలిసి పోరాటం..
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో తమ ఆందోళన కొనసాగిస్తామని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు. " జనాభా లెక్కలకు, NPR లెక్కలకు తేడా ఉంది. జనాభా లెక్కల్లో పుట్టిన ప్రదేశము తల్లిదండ్రుల వివరాలు అడగరు. కానీ ఎన్‌పిఆర్‌లో పౌరసత్వ వివరాలు అడుగుతున్నారు. అటువంటప్పుడు అది జనాభా లెక్కలు ఎలా అవుతాయి" అని అసదుద్దిన్ ఒవైసి ప్రశ్నించారు. తెలంగాణలో 29 శాతం మందికి మాత్రమే జనన ధృవీకరణ డాక్యుమెంట్లు ఉన్నాయని.. మా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సమాచార హక్కు చట్టం ద్వారా ఆ వివరాలు తెలుసుకున్నారని వెల్లడించారు.