యాంకర్ ప్రదీప్ పరారయ్యాడంటున్న పోలీసులు
యాంకర్ ప్రదీప్ పరారీలో ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో యాంకర్ ప్రదీప్ ఓ పరిచయం అక్కర్లేని పేరు. తన యాంకరింగ్ మెళకువలతో బుల్లితెరపై భారీ సంఖ్యలో అభిమానులని సొంతం చేసుకున్న యాంకర్ ప్రదీప్ డిసెంబర్ 31న రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే, మద్యం తాగిన మత్తులో కారు నడుపుతూ పట్టుబడిన ప్రదీప్ నియమనిబంధనల ప్రకారం ఆ తర్వాత రెండు రోజుల్లో పోలీసుల ఎదుట కౌన్సిలింగ్‌కి హాజరు కావాల్సి వున్నప్పటికీ ఇప్పటివరకు ప్రదీప్ పోలీసుల ముందుకు రాలేదు. అతడి ఆచూకీ కోసం ఇంటికి వెళ్లిన పోలీసులకి అక్కడ తాళం వేసిన ఇల్లు కనిపించింది. దీంతో ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ పరారీలో ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
కూకట్‌పల్లిలో వున్న ప్రదీప్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో వుంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు అందించిన నివేదికలో పేర్కొన్నాం. ఒకవేళ ప్రదీప్ గురువారం కూడా కౌన్సెలింగ్‌కు రానట్లయితే, ఇదే విషయంపై లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం చేస్తామని, ఆ తర్వాత చట్టరీత్యా వారే మిగతా వ్యవహారాన్ని చూసుకుంటారని ట్రాఫిక్ పోలీస్ అధికారవర్గాలు బుధవారం మీడియాకు తెలిపాయి. కేసు లా అండ్ ఆర్డర్ పోలీసుల వరకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ రోజు అయినా ప్రదీప్ పోలీసుల ఎదుట ప్రత్యక్షమవుతాడా లేదా అనేది ఈరోజు గడిస్తే కానీ చెప్పలేం.