కేసీఆర్ ఫోన్ చేయలేదు.. కనీసం నా మెస్సేజెస్‌కు స్పందించలేదు..
టీఆర్ఎస్ వీడే ముందు జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న బాబూ మోహన్
టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి, వచ్చే ఎన్నికల్లో ఈసారి ఆ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో.. చివరకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, బీజేపీ కండువ కప్పుకున్న బాబూ మోహన్ తాజాగా తాను టీఆర్ఎస్ పార్టీని వీడటానికి ముందు చోటుచేసుకున్న ఘటనలను గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో నేడు బీజేపీలో చేరిన అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పిలుపు మేరకే తాను బీజేపీలోలో చేరానని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. కానీ ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమేకాకుండా ఓసారి మంత్రిగానూ పనిచేశానని ఈ సందర్భంగా బాబూ మోహన్ గుర్తుచేసుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్, హరీశ్ రావులే తనను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశాను. అయినప్పటికీ ఆ పార్టీ తనను విస్మరించడం ఆవేదనకు గురిచేసిందన్నారు.
టీఆర్ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజున తాను రైతు బందు చెక్కుల పంపిణీ సమావేశంలో పాల్గొన్నాను. అయితే, కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మీ పేరు లేదు కదా అని ఒక మీడియా ప్రతినిథి వచ్చి చెప్పే వరకు తనకు కూడా ఆ విషయమే తెలియదు. అతడు చెప్పింది విన్నాకా.. ఆ 105 మందిలో చోటు దక్కించుకోలేకపోవడానికి తాను అంత పనికిరానివాడినా అని చాలా బాధనిపించింది. తనకు టికెట్ ఎందుకు కేటాయించలేదని కేటీఆర్‌ను అడిగితే ఆయన నుంచి సమాధానం రాలేదు. పోనీ కేసీఆర్ అయినా స్పందిస్తారేమో అనుకుంటే... ఆయన నుంచి కనీసం ఫోన్ కూడా రాకపోగా తాను ఎన్ని మెసేజ్‌లు పెట్టినా ఆయన స్పందించలేదని చెబుతూ బాబూ మోహన్ ఎంతో ఆవేదన వ్యక్తంచేశారు.
అయితే, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీతో కలిసి పనిచేయాలనే కోరిక తనలో ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్‌కి పనికిరాని వాడిని బీజేపీకి పనికొస్తానా అనే సందిగ్ధంలో ఉన్న సందర్భంలోనే స్వయంగా అమిత్ షానే పార్టీలోకి ఆహ్వానించడం ఆనందానికి గురిచేసిందని బాబూ మోహన్ సంతోషం వ్యక్తంచేశారు. అమిత్ షా తనని ఆహ్వానించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెబుతూ.. కార్యాచరణ రూపొందించిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తానని బాబూ మోహన్ తెలిపారు.