Begum Bazar Murder: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బేగం బజార్ పరువు హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. నీరజ్ పన్వార్‌ను హత్య చేసింది అతని భార్య పెద్దనాన్న కుమారులని తెలిపారు. తాగిన మత్తులోనే నిందితులు నీరజ్‌ను హతమార్చినట్లు పేర్కొన్నారు. నీరజ్ పన్వార్ హత్యోదంతానికి సంబంధించి శనివారం (మే 21) సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా డీసీపీ జోయల్ డేవిస్ వివరాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీసీపీ డేవిస్ వెల్లడించిన వివరాల ప్రకారం... నీరజ్-సంజన కులాంతర వివాహం యువతి ఇంట్లో ఇష్టం లేదు. నీరజ్‌తో వివాహం తర్వాత సంజనతో ఆమె కుటుంబం తెగదెంపులు చేసుకుంది. ఇక ఆమెతో తమకెటువంటి సంబంధం లేదని వదిలేసింది. అయితే సంజన పెద్దనాన్న కుమారులు మాత్రం ఈ పెళ్లితో తమ పరువు పోయిందని రగిలిపోయారు. నీరజ్ నిర్వహిస్తున్న పల్లీల షాపు వీరి ఇంటికి సమీపంలోనే ఉంది.


నీరజ్ రోజూ షాపుకు వస్తూ, పోతున్న సమయంలో వారికి ఎదురుపడేవాడు. నీరజ్‌ను చూసి వారు ఆగ్రహంతో రగిలిపోయేవారు. ఇదే క్రమంలో నీరజ్ హత్యకు 15 రోజుల క్రితం స్కెచ్ వేశారు. జుమేరాత్ బజార్‌లో నీరజ్ హత్య కోసం కత్తులు కొనుగోలు చేశారు. అతని కదలికలపై నిఘా పెట్టి.. శుక్రవారం (మే 21) రాత్రి 7.30 గంటల ప్రాంతంలో నీరజ్‌పై దాడికి పాల్పడ్డారు.


నీరజ్ బైక్‌పై తన తాతను ఎక్కించుకున్న వెళ్తుండగా యాదగిరి గల్లీ సమీపంలో నిందితులు అతని బైక్‌ను ఆపారు. గ్రానైట్ రాయితో నీరజ్ తలపై గట్టిగా కొట్టారు. ఆపై పదునైన కత్తులతో 20 సార్లు అతన్ని పొడిచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా తీవ్ర రక్తస్రావంతో నీరజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


సంజన-నీరజ్ గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. వివాహ తర్వాత షంషీర్‌గంజ్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లకు తనకు ప్రాణ భయం ఉందంటూ నీరజ్ పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో ఇరు వర్గాలను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇది జరిగిన ఏడాదికి నిందితులు నీరజ్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికైతే సంజన కుటుంబ సభ్యుల ప్రమేయం బయటపడలేదు. నిందితులను పోలీసులు హైదరాబాద్ శివారులో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు విజయ్ యాదవ్,  సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్, అభినందన్‌లుగా గుర్తించారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 


Also Read: Petrol Diesel Price: ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై కాంగ్రెస్ రియాక్షన్... దేశానికి 'జుమ్లా'లు అక్కర్లేదంటూ సెటైర్   


Also Read: Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీ తగ్గింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook