Komatireddy Venkat Reddy: అంతా సర్ధుకుందని అనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ లో మరో కలకలం రేగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో పీసీసీ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈ కేసులోనే ఈడీ ప్రశ్నించింది. తాజాగా తెలంగాణ నేతలకు నోటీసులు జారీ చేసింది. సీనియర్ నేతలకు నోటీసులు రావడం కాక రేపుతుండగా.. షబ్బీర్ అలీకి నోటీసు రాబోతుందంటూ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారమే ప్రకటించారు. ఆయన చెప్పినట్లే ఈడీ నోటీసులు రావడం తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి లేఖ రాశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆలేఖలో ఆయన కీలక అంశాన్ని ప్రస్తావించారు. షబ్బీర్ అలీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రియాంకా గాంధీని కోరారు. చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని.. ఈకేసుల్లో ఏ క్షణమైనా ఆయన కావొచ్చని తన లేఖలో కోమటిరెడ్డి ప్రస్తావించారు. అదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ పరువు పోతుందని చెప్పారు. అవినీతి ఆరోపణలున్న షబ్బీర్ అలీని పార్టీలోనే కొనసాగిస్తే.. ఆయన వల్ల పార్టీకి నష్టం జరగుతుందని లేఖలో కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతపై ఆరోపణలు చేస్తూ ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి లేఖ రాయడం సంచలనం కాగా.. ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే షబ్బీర్ అలీకి ఈడీ నోటీసులు రావడం చర్చగా మారిందియ


షబ్బీర్ అలీకి నోటీసులు రాబోతున్నాయనే తెలిసే కోమటిరెడ్డి .. అతనిపై ఆరోపణలు చేశారనే టాక్ వస్తోంది. అయితే షబ్బీర్ కు నోటీసుల సంగతి కోమటిరెడ్డికి ఎలా తెలుసన్నది ఆసక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచే ఆయనకు సమాచారం వచ్చి ఉండవచ్చంటున్నారు. కొంత కాలంగా పార్టీలో రెబెల్ వాయిస్ వినిపిస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.తన పార్లమెంట్ పరిధిలోని మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతున్నా అటు వైపు వెళ్లడం లేదు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆయన వెళ్లడం లేదంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ లోనే ఉంటూనే రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా లోపాయకారిగా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వెంకట్ రెడ్డిపై ఉన్నాయి. అదే సమయంలో కేంద్రమంత్రులను కలుస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని పైకి చెబుతున్నా కేంద్రమంత్రులతో రాజకీయ చర్చలు సాగుతున్నాయనే టాక్ వస్తోంది.


తాజాగా షబ్బీర్ అలీని నోటీసులు వస్తాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిన కొన్ని గంటల్లోనే అది నిజం కావడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. బీజేపీ పెద్దల నుంచే ఆయనకు లీక్ వచ్చిందంటున్నారు.  కేంద్ర సర్కార్ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితంగా ఉండటం వల్లే కోమటిరెడ్డికి ఈడీ నోటీసుల సమాచారం తెలిసిందంటున్నారు. ఈ పరిణామాలతో సోదరుడి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరడం ఖాయమంటున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ లోనూ కోమటిరెడ్డి విషయంలో సీరియస్ గా చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. సీనియర్ నేతను సస్పెండ్ చేయాలని లేఖ రాయడంపై పీసీసీ ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నారంటున్నారు. బీజేపీ పెద్దలతో కలిసే వెంకట్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారనే విషయాన్ని సోనియా, రాహుల్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కోమటిరెడ్డి విషయంలో ఈసారి సీరియస్ గా వ్యవహరించవచ్చని తెలుస్తోంది.


Read also: Joe Biden: అమెరికా అధ్యక్షుడి వింత చేష్టలు.. జోబైడెన్ కు ఏమైంది? వైరల్ వీడియో...


Read also: Krishnam Raju Pet: కృష్ణంరాజు మృతితో ఆయన పెంపుడు కుక్క చేసిన పని తెలిస్తే షాక్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి