తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా ?
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు జత కడతాయా ?
తెలంగాణలో డిసెంబర్ 7 ఎన్నికలు ముగియగా డిసెంబర్ 11న.. అంటే ఎల్లుండి మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా కే లక్ష్మణ్ ఓ ఆసక్తికరమన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రమేయం లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాదని ప్రకటించిన లక్ష్మణ్.. తాము కింగ్స్ కాలేకపోయినా.. కింగ్ మేకర్స్ అవుతాం అని అభిప్రాయపడ్డారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీకి ఆధిక్యం రానట్టయితే, తాము మరొకరికి మద్దతు పలకడం ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యులవుతాం అని అన్నారు. అయితే, తాము కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా ఏఐఎంఐఎం పార్టీకి కానీ మద్దతు ఇవ్వబోమని, ఈ రెండు పార్టీలు కాకుండా ఇతర పార్టీలకే తమ మద్దతు ఉంటుందని డా కే లక్ష్మణ్ తేల్చిచెప్పారు. ఫలితాల అనంతరం పొత్తుల నిర్ణయం ఏదైనా అధిష్టానంతో చర్చించి తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
ఇదిలావుంటే, లక్ష్మణ్ చేసిన ప్రకటన పలు సందేహాలకు తావిచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు కాకుండా ఇతర పార్టీలకు మద్దతు పలికేందుకు తాము సిద్ధంగానే ఉన్నాం అని బీజేపీ ప్రకటించిందంటే.. వారి ఆప్షన్స్‌లో ఉన్న మరో పెద్ద పార్టీ టీఆర్ఎస్ పార్టీనే అయి వుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నేరుగా ప్రకటన చేయకుండా తమ మనసులో మాటను ఇలా పరోక్ష ప్రకటన ద్వారా తెలియజేసి వుంటారా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ చర్చలు, జనాభిప్రాయాల సంగతి ఎలా వున్నా... అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరితో ఎవరికి అవసరం పడుద్ది అనే వివరాలు తెలియాలంటే ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే.