హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌ రెడ్డి ఇక లేరు. బంజరాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయలు కార్వాన్‌ నియోజకవర్గం నుంచి గెలిచి పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయనను అభిమానులు ముద్దుగా గోల్కొండ టైగర్ అని పిలుచుకునేవారు. వయస్సుపైబడినరీత్యా గత కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో అంత చురుకుగా లేని ఆయన ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేసి ఓటమిచెందారు. అప్పటి ఎంఐఎం అధినేత సలావుద్దీన్‌ ఒవైసీకి బలమైన రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరించిన బాల్ రెడ్డి ఒకానొక దశలో హైదరాబాద్‌లో ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. బద్దం బాల్ రెడ్డి మృతితో బీజేపి నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 


బద్దం బాల్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ అగ్రనేతలు తమ సంతాపం వ్యక్తంచేస్తూ ఆయన లేని లోటు పూడ్చలేనిది అని విచారం వ్యక్తంచేశారు.