Prakash Ambedkar About KCR: డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడాన్ని అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ కొనియాడారు. ప్రకాష్ అంబేడ్కర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. తెలుగులో మాట్లాడలేకపోతునందుకు చింతిస్తున్నాను అంటూ సభకు హాజరైన వారిని ఉద్దేశించి హిందీలో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రకాశ్ అంబేద్కర్ కృతజ్ఞతలు తెలిపారు. అంబేడ్కర్ జయంతిని అత్యంత ప్రత్యేకంగా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఒక కొత్త నడవడిక మొదలుపెట్టారు అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దళిత బందు పథకంపై ప్రకాశ్ అంబేద్కర్ ప్రశంసలు..
అంబేడ్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అని చెప్పిన ప్రకాశ్ అంబేడ్కర్... తెలంగాణలో దళితుల అభ్యున్నతికి కేసీఆర్ చేస్తున్న కృషిని అభినందనీయం అన్నారు. దళిత బందు పథకం అనేది దళితుల అభ్యున్నతికి పాటుపడేందుకు ఒక మంచి సంక్షేమ పథకం. ఈ దేశంలో గొప్పోడు గొప్పోడిగానే.. పేదోడు పేదోడిగానే ఉంటున్నాడు. కానీ అలాంటి ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు దళిత బందు పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. దళిత బందు పథకం ఫలితం ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా.. రానున్న రోజుల్లో తెలుస్తుంది అని అభిప్రాయపడ్డారు. దళిత బందు పథకాన్ని తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరంభించారు.. రానున్న రోజుల్లో మరో ముఖ్యమంత్రి ఎవరైనా స్టార్ట్ చేస్తారు. చేయాలని కోరుకుంటున్నా అని అన్నారు. 


దేశంలో మార్పు కోసం మరో యుద్ధం.. 
మనం ప్రజల్లో మార్పుకోసం, వ్యవస్థలో మార్పు కోసం, దేశంలో మార్పు కోసం యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలి అనే విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు ఒక కొత్త దిశ చూపించారు. దేశంలో సామాజిక అసమానతలతో పాటు ఆర్థిక అసమానతలపై ఆనాడే అంబేడ్కర్ పోరాడారు. అదే అంబేడ్కర్ స్పూర్తితో మరొకసారి దేశంలో ఆర్థిక పరిస్థితిని కాపాడుకునేందుకు కేసీఆర్ ఒక యుద్ధం మొదలుపెట్టారు అని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. దేశంలో ఒక్క రిలీజియస్ మైనార్టీ మాత్రమే లేదు... కమ్యూనిటీ పరమైన మైనార్టీ కూడా ఉంది. ఇదే విషయాన్ని ఆనాడు అంబేడ్కర్ చెప్పారు అని ప్రకాశ్ అంబేడ్కర్ గుర్తుచేశారు. 


దేశానికి రక్షణపరంగా రెండో రాజధానిగా హైదరాబాద్..
దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరం ఉంది. ఆ రెండో రాజధాని హైదరాబాద్ అయితేనే బాగుంటుంది అని ప్రకాశ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రెండో రాజధాని అవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది నెరవేరాలని కోరుకుంటున్నా అని ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు. హిందువులకు, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే ప్రతిపాదన మేరకే ఇండియా, పాకిస్తాన్ రెండు వేర్వేరు దేశాలుగా ఏర్పడ్డాయి అని అన్నారు.


కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టి కేసీఆర్‌పై ప్రశంసలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న ప్రస్తుత తరుణంలోనే హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ విగ్రహ స్థాపన కార్యక్రమం వేదికపై నుంచే ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుతం దేశానికి జాతీయ స్థాయి నాయకుడు లేడు. గతంలో వాజపేయి మాత్రమే జాతీయ నాయకుడిగా ఉండేవారు. ఆ తరువాత ఆ స్థాయి నాయకుడు కరువయ్యారని చెబుతూ పరోక్షంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆయన వేలెత్తి చూపించారు. ప్రాంతీయ పార్టీల నేతలకు జాతీయ స్థాయి నేతగా ఎదిగేందుకు మంచి అవకాశం ఉందని.. తెలంగాణ దేశానికి డిక్సూచిగా ఉందని వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా కేసీఆర్ నాయకత్వాన్ని ఆయన కీర్తించారు.