Telangana Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి ప్రజాదరణ అంతంత మాత్రమే.. తెలంగాణ వచ్చాక మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే జిల్లాలో మాత్రం ప్రతిసారి ఒక్కరే బీఆర్‌ఎస్ సభ్యుడు విజయం సాధించారు. 2014 లో జలగం వెంకట్రావ్‌ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్‌ మాత్రమే గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావ్‌ విజయం సాధించారు. ఆయన కూడా ఇప్పుడు అధికార పార్టీలో చేరిపోయారు. కానీ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇతర పార్టీల నేతలను ఆకర్షించడంలో సక్సెస్‌ అయ్యింది. ఇతర పార్టీల లీడర్లను చేర్చుకుని జిల్లాలో బలమైన శక్తిగా అవతరించింది.. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది లీడర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పెద్దలు ఏదైనా నిరసనలకు పిలుపునిస్తే.. ముఖం చాటేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం సై అన్న నేతలు.. ఇప్పుడు నిరసనలకు మాత్రం నై అంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతోందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mahesh babu: అరే వా.. శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ బాబు..?.. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మెస్మరైజ్ అవుతున్న అభిమానులు..


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లాలో మంత్రిగా పువ్వాడ ఏకచాత్రధిపత్యం చేలాయించారు. ఆయనకు తోడు ఇతర నేతలు కూడా ల్యాండ్ సెటిల్‌మెంట్లు, ఇతర దందాలతో భారీగానే వెనకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో అధికార పార్టీని ప్రశ్నించిన కాంగ్రెస్‌ నేతలపై కేసుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసినట్టు విమర్శలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి కేసులు బౌన్స్ బ్యాక్‌ అవుతాయని నేతలు భయపడుతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాలకు తమ అనుచరులను పంపించి తాము మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారని చెబుతున్నారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా బీఆర్ఎస్‌ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు జిల్లాల అధ్యక్షులు తాతామధు, రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికలకు కార్యకర్త లు సన్నద్ధం కావాలని నేతలంతా పిలుపు ఇచ్చారు. కానీ ఆ తర్వాత రోజే జరిగిన నిరసన కార్యక్రమానికి నేతలంతా డమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


ఇక రైతు భరోసా నిధుల అంశంపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలు ఇతర జిల్లాల్లో సక్సెస్‌ అయ్యాయి. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఆందోళణల్లో జిల్లాకు చెందిన కీలక నేతలు పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో నిర్వహించిన ఆందోళనకు పువ్వాడ డుమ్మా కొట్టగా తాతామధు, రేగా కాంతారావు, ఇతర నేతలు కూడా నిరసనల్లో పాల్గొనలేదు. అయితే ఇల్లందులో మాత్రం మాజీమంత్రి హరిప్రియ నాయక్‌ ఆందోళన నిర్వహించారు. అయితే నిరసనకు అనుమతి లేకపోవడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిప్రియతో పాటు.. 30 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు కట్టారు. ఈ కేసులపైన జిల్లా నేతలు నోరు మెదపకపోవడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. హరిప్రియ పోలీసులు కేసు పెడితే కనీసం ఖండించకపోవడం ఏంటని బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. 


మొత్తంగా బీఆర్ఎస్‌ సమావేశాలకు తప్పనిసరిగా పాల్గొంటున్న నేతలు.. ఆందోళనలకు మాత్రం దూరం దూరంగా ఉండటంపై పార్టీ పెద్దలు సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం. చూడాలి మరి పార్టీ పెద్దల వార్నింగ్‌లను ఖమ్మం నేతలు పట్టించుకుంటారా.. లేదంటే లైట్‌ తీసుకుంటారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలంటున్నారు రాజకీయ పరిశీలకులు..


Also Read: Secretariat: సోషల్‌ మీడియాలో లైక్‌లు, పోస్టులు, కామెంట్లు చేయొద్దు.. పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్‌


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


 ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook